జో బైడెన్‌ అధ్యక్షుడైతే... భారత్‌కు ఏంటి?

November 05, 2020


img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించి విజయానికి చేరువలో ఉన్నారు. ఒకవేళ ఆయన 270 ఓట్లు సాధిస్తే అమెరికా 46వ అధ్యక్షుడవుతారు. ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉంటే ఏమవుతుందో అందరూ చూశారు. ఇప్పుడు జో బైడెన్‌ అధ్యక్షుడైతే ఏవిధంగా ఉండబోతోందో రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. 

హెచ్-1బీ వీసాల, గ్రీన్‌ కార్డుల విషయంలో ట్రంప్‌ వైఖరి వలన ఇతరదేశాలతో పాటు భారత్‌కు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివచ్చింది. కానీ జో బైడెన్‌ తాను అధికారంలోకి వస్తే ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కనుక అమెరికాకు సేవలందించే భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు, వాటి ఉద్యోగులకు, ప్రవాసభారతీయులకు చాలా ఉపశమనం, లబ్ది కలుగవచ్చు. 

ట్రంప్‌ చైనా, పాకిస్థాన్‌ల పట్ల చాలా కటినవైఖరితో వ్యవహరించేవారు కనుక అది భారత్‌కు ఎంతో ఊరటనిచ్చేది. కానీ జో బైడెన్‌ గతంలో అనుసరించిన విధానాలను బట్టి చూస్తే ఆయన ఆ రెండు దేశాలతో సౌమ్యంగా వ్యవహరించవచ్చని అర్ధమవుతుంది. ఇది భారత్‌కు చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టించవచ్చు. 

ట్రంప్‌ కటినవైఖరి కారణంగా బలహీనపడిన పాక్‌కు ఒకవేళ జో బైడెన్‌ ఆర్ధిక సహాయం అందజేయడం ప్రారంభిస్తే పాక్‌ మళ్ళీ బలం పుంజుకొని భారత్‌కు సవాళ్ళు విసరడం ఖాయం. అలాగే కశ్మీర్‌ విషయంలో జో బైడెన్‌ వైఖరి పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నందున అదీ భారత్‌కు చాలా ఇబ్బందికరంగా మారవచ్చు. 

ఇక చైనా విషయానికి వస్తే...ఇంతకాలం భారత్‌కు అండగా దుందుడుకు వైఖరి కలిగిన ట్రంప్‌ అండగా ఉన్నారనే భయంతో చైనా సరిహద్దులవద్ద బరి తెగించలేకపోయింది. కానీ ఇప్పుడు జో బైడెన్‌ చైనా పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే అది భారత్‌పై రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. 

అయితే జో బైడెన్‌ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంటారు కనుక చైనా వలన భారత్‌కు ఎటువంటి ప్రమాదం కలుగకుండా అడ్డుకోవడం ఖాయమే. తాను అధ్యక్షుడైతే భారత్‌తో ఉదారంగా వ్యవహరిస్తానని జో బైడెన్‌ పదేపదే చెప్పారు కనుక భారత్‌తో సంబంధాలు బలపరుచుకొనేందుకు ప్రయత్నించవచ్చు. ఆ కారణంగా భారత్‌-అమెరికా మద్య వ్యాపారలావాదేవీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. భారత్‌ సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపడితే ఆమె వలన కూడా భారత్‌కు ఎంతో కొంత మేలు జరుగవచ్చు. 


Related Post