జో బైడెన్‌కే అమెరికా పగ్గాలు?

November 05, 2020


img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు రిపబ్లికన్ పార్టీ (డోనాల్డ్ ట్రంప్‌) 214, డెమొక్రాట్ పార్టీ (జో బైడెన్‌) 264 దక్కించుకొన్నాయి. అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే కనీసం 270 గెలుచుకోవలసి ఉంటుంది. తాజా ఫలితాల ప్రకారం జో బైడెన్‌ ఆధిక్యతలో ఉన్నారని స్పష్టం అవుతోంది. 

ఒకవైపు ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతుంటే, డోనాల్డ్ ట్రంప్‌ బుదవారం తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో చాలా అక్రమాలు జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియపై కూడా నాకు అనుమానాలున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలలో మనమే మనమే గెలిచాము. కనుక సంబరాలు జరుపుకొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలని” అని అన్నారు. కానీ కౌంటింగ్ పూర్తికాక మునుపే ట్రంప్‌ ఆవిధంగా ప్రకటించుకోవడాన్ని జో బైడెన్‌తో సహా రాజకీయ విశ్లేషకులు, మీడియా కూడా తప్పు పట్టింది. 

మొదట కీలక రాష్ట్రాలలో ట్రంప్‌-బైడెన్‌ల మద్య ‘నువ్వా నేనా?’ అన్నట్లు పోటీ సాగినప్పటికీ తరువాత మళ్ళీ బైడెన్ పుంజుకొని 264 స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ 270కి కేవలం 6 ఓట్ల దూరంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో కీలక రాష్ట్రాలలో ఒకటిగా భావిస్తున్న మిషిగన్ రాష్ట్రంలో ఉన్న 16 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను జో బైడెన్‌ గెలుచుకొన్నారు. దాంతో మిషిగన్ ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డోనాల్డ్ ట్రంప్‌ మిషిగన్ కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. 

మెయిల్-ఇన్‌ బ్యాలెట్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నట్లు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఒకవేళ ఈ వ్యవహారంపై ట్రంప్‌ సుప్రీంకోర్టుకు వెళితే ఆయనను ఎదుర్కొనేందుకు తమ బృందం కూడా సిద్దంగానే ఉందని జో బైడెన్‌ అన్నారు. 

ఒకవైపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతుండగా కొన్ని రాష్ట్రాలలో ఇంకా మెయిల్-ఇన్‌ బ్యాలెట్లను అనుమతిస్తుండటంపై ట్రంప్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జో బైడెన్‌ ఆధిక్యతలో ఉన్నందున, మెయిల్-ఇన్‌ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వేసేవారు బైడెన్‌కు అనుకూలంగా మారుతారని ట్రంప్‌ ఆందోళన చెందడం సహజం. కనుక తక్షణమే వాటి స్వీకరణ, కౌంటింగ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాలను గట్టిగా కోరారు. 

కానీ ఇంకా నార్త్ కరోలినా, అలాస్కా రాష్ట్రాలలో మెయిల్-ఇన్‌ బ్యాలెట్లను స్వీకరిస్తుండటంతో ఈ నెల 12 వరకు ఓట్ల లెక్కింపు కొనసాగబోతోంది. కనుక ఆ రెండు రాష్ట్రాలలో అప్పటివరకూ పూర్తి ఫలితాలు తెలిసే అవకాశం లేదు. నార్త్ కరోలినాలో 15, అలాస్కాలో 3 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. అదేవిధంగా పెన్సిల్వేనియాలో 20, జార్జియా రాష్ట్రంలో 17 ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో తుది ఫలితాలు మరికొన్ని గంటలలో వెలువడే అవకాశం ఉంది. 


Related Post