బిజెపిపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

November 02, 2020


img

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బిజెపిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో భారీస్థాయిలో అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్రలు పన్నుతున్నట్లు ఆ పార్టీలోని విశ్వసనీయవర్గాల ద్వారా మాకు సమాచారం అందింది. ఇవాళ్ళ (ఆదివారం) ఓ బిజెపి కార్యకర్త ఆ పార్టీ కార్యాలయం ముందు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దానిని ఆధారంగా చేసుకొని ప్రగతి భవన్‌, తెలంగాణ భవన్‌లను ముట్టడించి భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించేందుకు బిజెపి కుట్రలు పన్నుతున్నట్లు మాకు సమాచారం అందింది. లాఠీ ఛార్జ్, కాల్పులతో తీవ్రరక్తపాతం జరిగేస్థాయిలో ఆ అల్లర్లు జరపాలని, తద్వారా దుబ్బాక  ప్రజల సానుభూతి పొంది ఉపఎన్నికలలో గెలవాలని బిజెపి యత్నిస్తున్నట్లు మాకు తెలిసింది.

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో బిజెపి తన రాజకీయలబ్ది కోసం అల్లర్లకు పూనుకొంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖకు, రాష్ట్ర డీజీపీకీ లేఖల ద్వారా ఈవిషయం తెలియజేసి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని కోరాము. బిజెపి తన రాజకీయలబ్ది కోసం తన కార్యకర్తల రక్తాన్నే కోరాలనుకోవడం చాలా శోచనీయం. అటువంటి పరిస్థితులు కల్పించవద్దని బిజెపికి విజ్ఞప్తి చేస్తున్నాను.

దుబ్బాక ఉపఎన్నికలలో గెలిచేందుకు బిజెపి నేతలు నోటికొచ్చినట్లు అబద్దాలు చెపుతున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు, దుబ్బాకలో ఓటర్లకు డబ్బు పంచిపెట్టి ఓట్లు దండుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేటలో ఆయన మామగారింట్లో భారీగా డబ్బు పట్టుబడింది. అంతకు ముందు రెండుసార్లు హైదరాబాద్‌ నుంచి దుబ్బాకకు డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. కానీ ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. మళ్ళీ ఇవాళ్ళ తన బావమరిదితో కారులో కోటి రూపాయలు దుబ్బాకకు తరలింపజేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. అబద్దాలు, డబ్బు, అల్లర్లతో దుబ్బాక ఉపఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్న బిజెపికి ఓటర్లు తప్పకుండా గట్టిగా బుద్ధి చెపుతారు. బిజెపి నేతలు తమ పార్టీ ప్రయోజనాల కోసం హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు. 


Related Post