2019 ఫిబ్రవరిలో పాక్‌పై భారత్‌ యుద్ధానికి సిద్దమైందా?

October 29, 2020


img

2019 ఫిబ్రవరిలో భారత్‌-పాక్‌ మద్య ఘర్షణలు జరుగుతున్నప్పుడు భారత్‌ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వెంటాడి కూల్చివేసారు. ఎదురుకాల్పులలో ఆయన నడుపుతున్న యుద్దవిమానం పాక్‌ భూభాగంలో కూలిపోయింది. అప్పుడు పాక్‌ సైనికులు ఆయనను బందీగా పట్టుకొని చిత్రహింసలు పెట్టారు. ఆయనను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది. అమెరికా తదితర దేశాల ద్వారా పాక్‌పై తీవ్ర ఒత్తిడి చేయించింది కూడా. కానీ పాక్‌ సైనికాధికారులు బందీగా చిక్కిన అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టేందుకు అంగీకరించలేదు. 

ఈ నేపధ్యంలో పాక్‌ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ అధికారులు, పార్లమెంటరీ నేతలు, ఆర్మీ చీఫ్ జనరల్ కామర్ జావేద్ బజ్వాతో సమావేశమయ్యి తదనంతర పరిణామాల గురించి చర్చిస్తున్నారు. ఆ సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ హాజరుకావలసి ఉంది కానీ ఆయన కాలేదు. 

ఆ సమావేశంలో ఖురేషీ అభినందన్ వర్ధమాన్‌ను తక్షణమే విడిచిపెట్టాలని ఆర్మీ అధికారులకు గట్టిగా చెప్పారు. లేకుంటే ఆరోజు రాత్రి 9 గంటల తరువాత ఎప్పుడైనా భారత్‌ మనదేశం మీద దాడి చేసేందుకు సిద్దంగా ఉందని చెప్పారు. అది విని పాక్‌ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయని, భయంతో వణికిపోయారు. ఆనాడు జరిగిన ఈ విషయాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్ (ఎన్‌)నేత , ఎంపీ ఆయాజ్ సాదిక్ ఇటీవల పాక్‌ పార్లమెంటులో బయటపెట్టారు. 

అభినందన్ వర్ధమాన్‌ను విడిపించుకొనేందుకు దేనికైనా సిద్దమేనని ఆనాడు భారత్‌ చేసిన ప్రకటన సారాంశం ఇదేనన్నమాట. గత నాలుగు దశాబ్ధాలుగా భారత్‌లో ఉగ్రవాదులతో దాడులు జరిపిస్తూ, వేర్పాటువాదులతో కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తూ, భారత్‌పై అణుబాంబులు ప్రయోగించి ప్రపంచపటంలో కనిపించకుండా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌ పాలకులకు, సైన్యాధికారులకు ఎంత ధైర్యం ఉందో ఆ దేశపు ఎంపీయే స్వయంగా పాక్‌ పార్లమెంటులోనే బయటపెట్టారు.


Related Post