ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు కుర్ర హీరోలు, దర్శకులు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. యువ నటుడు నారా రోహిత్ మొన్న రాత్రి తన ప్రతినిధి-2 హీరోయిన్ లేళ్ళ శిరీషని పెళ్ళి చేసుకున్నారు.
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహ నిశ్చితార్ధం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులు, చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ దంపతులు, ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహిత బంధుమిత్రులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కుమార్తె నయనిక రెడ్డికి అల్లు శిరీష్‌కి చాలా కాలం క్రితమే పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. వారిద్దరి ప్రేమకి పెద్దల ఆశీర్వాదం లభించడంతో నిన్న వివాహ నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వారి వివాహం జరుగబోతోంది.