దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్ పధకం కింద 15 ఏళ్ళకు మించిన పాత వాహనాలను తుక్కుగా చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోంది.
దేశవ్యాప్తంగా పాత డొక్కు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ పధకం కింద దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా తొమ్మిది ప్రధాన నగరాలకు 15,000 ఎలక్ట్రిక్ బస్సులు అందజేయబోతోంది. ఒక్కో బస్సుకి రూ.35 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది.
ఈ పధకం కింద హైదరాబాద్‌కి ఏకంగా 2,000 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. ఈ బస్సులు తయారీ, సరఫరా, అమ్మకం తదనంతర సర్వీసుల కొరకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6న టెండర్లు ఆహ్వానించబోతోంది.
టీజీఎస్ ఆర్టీసీ 2023లోనే 1010 బస్సులకు ఆర్డర్ పెట్టగా వాటిలో 775 ఎలక్ట్రిక్ బస్సులు అందాయి. మిగిలిన 275 బస్సులు కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 2,000 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. అవి టీజీఎస్ ఆర్టీసీ చేతికి వచ్చేసరికి మరో మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు. కానీ ఆలస్యమైనా డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు రావడం ఖాయమే.