పొరుగు రాష్ట్రం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నేడు తీవ్ర విషాద ఘటన జరిగింది. జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం త్రొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే భక్తులను నియంత్రించి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
నేడు కార్తీక మాసంలో తొలి ఏకాదశి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో ఆలయాలన్నీ ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కాశీబుగ్గలోని స్వామివారి ఆలయానికి కూడా అలాగే తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు. గంటలు గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరిగిపోయి తోపులాట మొదలైంది. ఆ సమయంలో ఓ పక్క స్టీల్ రెయిలింగ్ ఊడి పడిపోవడంతో మహిళలు కింద పడిపోయారు. ఆ కారణంగా క్యూలైన్ కాస్త ముందుకు కదిలినట్లు అనిపించడంతో వెనకున్నవారు త్వరగా ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. దాంతో త్రొక్కిసలాట జరిగి దైవ దర్శనానికి వచ్చిన 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.