పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురు తమ ప్రియులతో లేచిపోయిన వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఈ పెళ్ళికి ముందు కూడా అలాగే ఇద్దరూ లేచిపోయారు. అయితే పెళ్ళి కొడుకో, పెళ్ళి కూతురో కాదు... వారి తల్లి తండ్రులు!
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లాలో బాద్ నగర్‌కు చెందిన ఓ రైతు (50) తన కుమార్తెని అదే జిల్లాలోని ఊంట్ వాసా గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో పెళ్ళి నిశ్చయం చేశాడు. ఆ తర్వాత పెళ్ళి పనుల కోసం తరచూ వరుడి ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. ఆ క్రమంలో అతను, వరుడి తల్లి (45) పరస్పరం ఆకర్షితులయ్యారు. కానీ తమ ప్రేమని కుటుంబ సభ్యులతో సహా సమాజం అంగీకరించకపోగా చీత్కరిస్తుందని వారికి తెలుసు. కనుక ఇద్దరూ పిల్లల పెళ్ళికి ముందే లేచిపోయారు.
కానీ వారు ఇలా చేస్తారని ఊహించని ఇరు కుటుంబాలు తీవ్ర ఆందోళనతో పోలీసులకు పిర్యాదు చేశారు. వారి విచారణ జరిపి వారిద్దరికీ ఏమీ కాలేదని, ఇద్దరూ లేచిపోయారని, చిక్లీ అనే గ్రామంలో కాపురం పెట్టేశారని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
దీంతో అందరూ చిక్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు రాకపోవడంతో మళ్ళీ పోలీసులకు పిర్యాదు చేశారు.
కానీ వారిరువురూ జీవిత భాగస్వాములు కోల్పోయి ఒంటరిగా మారిన మేజర్లు కనుక వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పారు. దీంతో ఇక చేసేదేమీ లేక పెళ్ళి రద్దు చేసుకున్నారు.