జూబ్లీహిల్స్‌ గేమ్‌ చేంజర్‌ అజారుద్దీన్‌?

November 01, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ గేమ్‌ చేంజర్‌గా మారారా? అంటే అవుననే అంటున్నారు బీజేపి నేతలు, కేటీఆర్‌. నియోజకవర్గంలో ఉన్న 60,000 మంది ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారని బీజేపి నేతలు వాదిస్తుంటే, బీఆర్ఎస్‌ చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే సిఎం రేవంత్ రెడ్డి హడావుడిగా మహ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి కట్టబెట్టారని కేటీఆర్‌ వాదిస్తున్నారు.

కనుక ఈ ఉప ఎన్నికలో మహ్మద్ అజారుద్దీన్‌ గేమ్‌ చేంజర్‌గా మారారని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయన్న మాట! అయితే ఈ విషయం అవి చాలా ఆలస్యంగా గ్రహించాయి. 

నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో ముస్లిం ఓటర్లను మినహాయిస్తే మిగిలినవారు మూడు పార్టీల మద్య చీలిపోతారు. కనుక ఏ పార్టీకి ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడతాయో అదే ఈ ఉప ఎన్నికలో గెలిచే అవకాశం ఉంటుందన్న మాట! 

ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డి ముందుగానే పసిగట్టి మహ్మద్ అజారుద్దీన్‌ని ఎమ్మెల్సీ సీటుతో పక్కకు తప్పించేసినట్లు బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలను భ్రమింపజేశారు. ఆ ధీమాతో అవి అడుగు ముందుకు వేయగానే చకచకా పావులు కదిపి వాటికి చెక్ పెట్టారు. మహ్మద్ అజారుద్దీన్‌ నియామకంపై అవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన గురించి మాట్లాడుతుండటమే ఇందుకు నిదర్శనం. 

అయితే ఇది బీజేపికి కొంత కలిసి వస్తుంది. అది కాంగ్రెస్‌-మజ్లీస్ బంధం, అజారుద్దీన్‌ గురించి గట్టిగా మాట్లాడుతూ నియోజకవర్గంలో హిందూ ఓటర్లను ఆకర్షించ గలదు. కానీ బీఆర్ఎస్‌ పార్టీ నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ పవర్ ప్లేలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో నవంబర్‌ 14న ఫలితాలు వెలువడితే తెలుస్తుంది. 


Related Post