సిఎం కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు

October 29, 2020


img

సిఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి తాసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి సుమారు గంటకు పైగా ప్రసంగించారు. సిఎం కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు: 

• ఈ కార్యక్రమం కోసం ఈ మూడుచింతలపల్లి గ్రామాన్నే ఎందుకు ఎంచుకొన్నానంటే ఈ గ్రామానికే చెందిన వీరారెడ్డి 1969లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి జైలుకు కూడా వెళ్ళారు. ఆ తెలంగాణ ముద్దుబిడ్డ పుట్టిన ఈ గడ్డకు గుర్తింపు లభించాలనే ఉద్దేశ్యంతోనే ఈ గ్రామాన్ని ఎంచుకొన్నాను.  

• ధరణి పోర్టల్‌లో ఇప్పటికే రాష్ట్రంలోని ఒక కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు నమోదయ్యాయి. 

• ప్రజల, రైతుల భూములకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ధరణీ పోర్టల్‌ను రూపొందించాము. 

• ఒక ప్రభుత్వం తప్పు చేస్తే అనేకతరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనుక ఎటువంటి తప్పులు జరుగకుండా చూసుకోవలసిన బాధ్యత నాపైన, నా ప్రభుత్వంపైన ఉంది. అందుకే గతంలో జరిగిన తప్పులను కూడా సరిచేసి ధరణి పోర్టల్‌ను రూపొందించాము.  

• ఆస్తుల క్రయవిక్రయాలు చాలా సులువుగా అందరికీ అర్దమయ్యేవిధంగా, పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావులేకుండా చేసుకొనేందుకు వీలుగా ధరణి పోర్టల్‌ను రూపొందించాము.  

• ధరణి పోర్టల్‌లో ఒకసారి వివరాలు నమోదు చేశాక వాటిని భూమి లేదా ఆస్తి యజమాని వేలిముద్ర లేకుండా ఏ అధికారి ఆ వివరాలను మార్చలేడు. కనుక రైతుల భూములను ఎవరూ కాజేయలేరు. 

• వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో గతంలో అధికారులు కూడా వేలుపెట్టేవారు. కానీ కొత్త రెవెన్యూ చట్టంలో కుటుంబానికే ఆ అధికారం దఖలు పరిచాము. కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఆస్తుల పంపకాలు చేసుకొని ఆ లేఖను తాసీల్దార్‌కు అందజేసినట్లయితే, వారు కోరుకొన్నట్లుగా వారి సమక్షంలోనే ఆయా ఆస్తులను  ధరణిలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. 

• సాదాబైనామాలకు (కాగితాల మీద వ్రాసుకొని కొనుగోలుచేసిన భూములు లేదా ఆస్తులను క్రమబద్దీకరించుకోవడానికి ఇదే చిట్ట చివరి అవకాశం. మళ్ళీ మరోసారి అవకాశం ఇవ్వబోము. వీటి కోసం ఇప్పటికే 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కనుక గడువును మరొక వారంరోజులు పొడిగించాలని నిర్ణయించాము. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కోసం ఎవరూ ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదు. సమీపంలోని మీ సేవా కేంద్రంలో లేదా ఎంఆర్వో లేదా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొంటే, వాటిని పరిశీలించి, అంతా సవ్యంగా ఉన్నట్లయితే, ఆ వివరాలను ధరణీలో నమోదు చేసి ఉచితంగా మీపేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు.    

• కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌ ద్వారా కొత్త పద్దతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. పాతరేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. 

• తెలంగాణలో ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా డిజిటల్ సర్వే చేయిస్తాము. ప్రపంచంలోకెల్ల అత్యంత ఖచిత్తమైన, నిర్వివాదాంశమైన విధానం అది. కనుక గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చొరవ తీసుకొని నూటికి నూరుశాతం ఖచ్చితత్వంతో సర్వే జరిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

• ధరణీలో ఎవరికి వారు ఉచితంగా డాక్యుమెంట్లు తయారుచేసుకొనేందుకు వీలుగా నమూనాపత్రాలను ఉంచాము. ఒకవేళ స్వయంగా చేసుకోలేమనుకొంటే, ప్రభుత్వమే డాక్యుమెంట్ రైటర్స్ పేర్లను, వారికివ్వవలసిన ఫీజును కూడా ధరణీలో పేర్కొంటుంది. వారి సాయంతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

• ఇదొక సరికొత్త విధానం కనుక మొదట్లో ఏవైనా లోపాలు, ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఎదురవవచ్చు. వాటన్నిటినీ అధిగమించి ధరణి పోర్టల్‌ను విజయవంతంగా నడిపించుకొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాము. 

• కౌలురైతులకు రైతు బంధు పధకం వర్తింపజేయాలని చాలా మంది ఒత్తిడి చేస్తున్నారు. కానీ దానివలన కొత్త సమస్యలు తలెత్తుతాయి. కనుక కౌలురైతులకు దానిని వర్తింపజేయకూడదనే మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. 

• కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాదాయం తగ్గిపోయినప్పటికీ పింఛన్లు, రైతు బంధుతో సహా ఏ సంక్షేమ పధకం ఆపలేదు. ఇప్పుడు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది కనుక హైదరాబాద్‌లో ఆర్ధికశాఖ అధికారి అక్కడ ఓ బటన్ నొక్కగానే రైతుబంధు సొమ్ము నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకే వచ్చేస్తుంది.  

• దేశానికే ఆదర్శంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ గురించి తెలుసుకొని ఇతర రాష్ట్రాల అధికారులు మనకు ఫోన్లు చేస్తున్నారు.

•  తెలంగాణ రైతన్నల అప్పులన్నీ తీరిపోయి, వారి బ్యాంక్ ఖాతాలలో వారి సొంతసొమ్ము మూడో...నాలుగో.. పదో.. పన్నెండో లక్షలు ఉండే స్థాయికి ఎదగాలని వారి సొంత డబ్బుతోనే వ్యవసాయం చేసుకొనే రోజురావలనేదే నా కోరిక. దానికోసమే రైతుల కోసం ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలను, సంస్కరణలను అమలుచేస్తున్నాము. ఆ కల కూడా త్వరలోనే సాకారమవుతుందని ఆశిస్తున్నాను, " అని సిఎం కేసీఆర్ ఆన్నారు. 


Related Post