భారత్‌ వృద్ధిరేటు భారీగా పతనం

October 26, 2020


img

ఈ ఏడాది జనవరి వరకు అన్ని రంగాలలో చాలా స్థిరంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్‌పై కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో లాక్‌డౌన్‌ అనివార్యమైంది. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని చిన్నా పెద్ద పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ, రవాణా, హోటల్ తదితర రంగాలన్నీ మూతపడ్డాయి. దాంతో వాటిలో పనిచేస్తున్న లక్షలాదిమంది రోడ్డునపడ్డారు. ఓ వైపు కరోనా... మరోవైపు ఎక్కడ చూసినా నిరుద్యోగసమస్య, మరోపక్క అన్ని రంగాలు మూతపడటంతో దేశఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. ‌దీంతో అన్ని దేశాలతో పాటు భారత్ కూడా ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లు నిలిచిపోయి భారత్‌ ఆర్ధికవ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 

కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా అమెరికా వృద్ధిరేటు 9.5 శాతం, జపాన్ వృద్ధిరేటు 7.6 శాతం తగ్గిపోగా భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఏకంగా 23.9 శాతం తగ్గిపోవడం చాలా ఆందోళనకరంగా మారింది. దేశంలో సంఘటిత రంగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా ఇది. ఒకవేళ అసంఘటిత రంగాలను అంటే కిరాణా కొట్లు, హోటల్స్, భవన నిర్మాణ కార్మికులు, రోడ్ల పక్కన కూరగాయలు వగైరాలు అమ్ముకోనేవారందరికీ కలిగిన నష్టాన్ని, వారి ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తే ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువగానే భారత్‌ వృద్ధిరేటు పడిపోయుండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు మూతపడటం, ఆ కారణంగా నిరుద్యోగ సమస్య లేదా జీతాలలో భారీ కోతల కారణంగా షేర్ మార్కెట్లలో, స్థిరాస్తులు, పెట్టుబడులు తగ్గాయి. నిరుద్యోగం లేదా ఉద్యోగభద్రత తగ్గడంతో ఉద్యోగులు పొదుపు మంత్రం పటిస్తుండటంతో అన్ని రంగాలలో కొనుగోళ్ళు పడిపోయాయి. ఈ ప్రభావం దేశఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. తత్ఫలితంగా 1996 తరువాత మళ్ళీ మొదటిసారిగా భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఇంత దిగువకు పడిపోయింది.

ఇది మరింత పడిపోకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం అనేక ఉద్దీపనలను ప్రకటించింది. అయితే అవి ఎంతవరకు ఫలించాయో తెలియవలసి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్ని రంగాలు క్రమంగా పూర్వస్థాయిలో పనిచేయడం ప్రారంభించినందున, బహుశః వచ్చే త్రైమాసికంలో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు మెరుగుపడవచ్చు. కానీ మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే, అభివృద్ధే ధ్యేయంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా చిత్తశుద్దితో పనిచేయాల్సి ఉంటుంది. అన్ని రంగాలు కోలుకోవడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహాయసహకారాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడే భారత్‌ ఈ ఆర్ధిక ఊబిలో నుంచి బయటపడగలుగుతుంది లేకుంటే ఇంకా కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.


Related Post