సిఎం కేసీఆర్‌ దత్తపుత్రికకు త్వరలో వివాహం

October 19, 2020


img

సుమారు మూడేళ్ళక్రితం కన్నతండ్రి, పినతల్లి చేతుల్లో చిత్రహింసలు అనుభవించి ఆసుపత్రిలో మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన ప్రత్యూష అనే అమ్మాయిని ఆనాడు సిఎం కేసీఆర్‌ ఆడుకొని అండగా నిలబడటమే కాక ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆమెను మహిళాశిశుసంరక్షణాలయంలో ఉంచి విద్యాబుద్దులు నేర్పించారు. ఓ ఐఏఎస్ అధికారిణికి ఆమె బాగోగులు చూసుకొనే బాధ్యత అప్పగించారు. ఆమె పర్యవేక్షణలో ప్రత్యూష పూర్తిగా కోలుకోవడమే కాక నర్సింగ్ కోర్స్ పూర్తిచేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇప్పుడు ఆమె కోరుకొన్నవాడితో త్వరలో వివాహం చేసుకోనుంది.  

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న చరణ్ రెడ్డి అనే యువకుడు ప్రత్యూష గురించి తెలుసుకొని ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అతని తల్లితండ్రులు కూడా వారి పెళ్ళికి అంగీకరించడంతో ప్రత్యూష కూడా అంగీకారం తెలిపింది. ఈవిషయం మహిళాశిశు సంక్షేమ అధికారులు సిఎం కేసీఆర్‌కు తెలియజేయడంతో, చరణ్ రెడ్డి కుటుంబం గురించి వాకబు చేయించారు. వారిది చాలా మంచి కుటుంబమే అని నిర్ధారణ అవడంతో సిఎం కేసీఆర్‌ ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని మాట్లాడి ఆమె అభిప్రాయం తెలుసుకొన్నారు. ఆమె కూడా ఈ పెళ్ళికి ఇష్టపడుతుండటంతో హైదరాబాద్‌ విద్యానగర్‌లోగల ఓ హోటల్లో చాలా నిరాడంబరంగా వారి వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. ప్రత్యూష తరపున మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ దివ్య నిలబడి ఈ కార్యక్రమం జరిపించారు. త్వరలోనే ప్రత్యూష, చరణ్ రెడ్డిల వివాహం జరుగనుంది. 


Related Post