ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీష్‌రావు సూటి ప్రశ్న

October 13, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో పోటీ పడుతున్న టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో వాటి నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ ఎన్నికల వేడిని ఇంకా పెంచుతున్నారు. టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి హరీష్‌రావు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ సూటి ప్రశ్న వేశారు.

“మీ సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో మీరు వదులుకొన్న ఎమ్మెల్యే సీటును మళ్ళీ గెలుచుకోలేకపోయారు. మీ సొంత నియోజకవర్గంలోనే మీ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేనివారు ఇక్కడ టిఆర్ఎస్‌ సీటును ఏవిధంగా గెలుచుకోగలమని కలగంటున్నారు? హుజూర్‌నగర్‌లో చెల్లని మీ మాట దుబ్బాకలో చెల్లుతుందా?ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు మొదలుపెట్టినా కాంగ్రెస్ పార్టీ వాటికి అడ్డుపడుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని వ్యతిరేకిస్తోంది గాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు,” అని అన్నారు. 

మంత్రి హరీష్‌రావు మాటలు ఆలోచించదగ్గవే. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తారనే నమ్మకంతోనే 2018 శాసనసభ ఎన్నికలలో హుజూర్‌నగర్‌ ప్రజలు ఆయనను మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపారు. కానీ ఆయన తన సొంత రాజకీయ ప్రయోజనం మాత్రమే చూసుకొంటూ 2019 లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచిన తరువాత తన ఎమ్మెల్యే పదవిని వదులుకొన్నారు. అంటే హుజూర్‌నగర్‌  ప్రజలు ఆయనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పవచ్చు. అందుకే హుజూర్‌నగర్‌  ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన భార్య పద్మావతి రెడ్డిని ప్రజలు తిరస్కరించి టిఆర్ఎస్‌ను గెలిపించారు. 

కనుక సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లోనే ప్రజలు తిరస్కరించినప్పుడు, టిఆర్ఎస్‌ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకలో ప్రజలు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఎందుకు నమ్ముతారు? ఎందుకు ఆదరిస్తారు? అధికారపార్టీ అభ్యర్ధిని కాదని, ఏ అధికారమూ లేని, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు తీసుకురాలేని కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఎందుకు ఓటు వేయాలి? అనే ప్రశ్నలకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలరా? 


Related Post