ఫిరాయింపులు ఎన్నికల వ్యూహమా...అభద్రతాభావమా?

October 12, 2020


img

దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా రాజకీయ నేతలు పార్టీలు ఫిరాయించడం సర్వసాధారణ విషయం అయిపోయింది. పైగా అదేదో ఘనకార్యమన్నట్లు పార్టీలు, ఫిరాయింపుదారులు కూడా చెప్పుకోవడం విశేషం. ఫిరాయింపులను ప్రజలు కూడా తప్పుగా భావించకపోవడం వలన నేతలు తమ ఆశయాలు, సిద్దాంతాలను అన్నిటినీ పక్కనపడేసి నిర్భయంగా, నిసిగ్గుగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. మీడియా కూడా అది చాలా గొప్ప విషయమే అన్నట్లు వర్ణించి, విశ్లేషించి చెపుతుండటంతో ప్రజలు కూడా ఫిరాయింపులకు అలవాటుపడిపోయారు. 

ఈ ఫిరాయింపులకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా అతీతంకాదని ఆనాడే నిరూపించి జనాలకు అలవాటు చేసేశారు. అయితే ఈ ఫిరాయింపులు నేతల అవకాశవాదమా? లేక పార్టీల రాజకీయ, ఎన్నికల వ్యూహమా...లేక అభద్రతాభావమా? అని ప్రశ్నించుకొంటే అన్నీ అని సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. 

ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు టికెట్ దక్కించుకోవడానికి వెంటనే వేరే పార్టీలోకి జంప్ చేయడం అవకాశవాదం. ఒకప్పుడు కుహానా లౌకికవాదపార్టీల మద్యనే ఈ ఫిరాయింపులు జరుగుతుండేవి కానీ ఇప్పుడు మతతత్వపార్టీగా ముద్రపడిన బిజెపి నుంచి లేదా బిజెపిలోకి కూడా ఫిరాయింపులు కొనసాగుతుండటం గమనిస్తే నేతలకు పదవులు, అధికారం, కాంట్రాక్టులు, వ్యాపారాలు, కమీషన్లు డబ్బు సంపాదన మాత్రమే ముఖ్యం తప్ప పార్టీల భిన్నమైన సిద్దాంతాలతో పనిలేదని స్పష్టమవుతుంది. 

ఇక అధికార పార్టీలు తమకు ఎదురులేకుండా చేసుకోవడానికి ప్రతిపక్షాలను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఈ ఫిరాయింపు ఆయుధాన్నే వాడుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. దీనిని రాజకీయ వ్యూహమనుకోవచ్చు.  దానికి అభివృద్ధి, సంక్షేమం వంటి అందమైన పేర్లను తగిలిస్తూ ప్రజలను కూడా మభ్యపెట్టాలనుకొంటున్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీయడానికి ఫిరాయింపులు ప్రోత్సహించడం ఎన్నికల వ్యూహమనుకోవచ్చు. 

తమ ప్రత్యర్ధులు తమ కంటే చాలా బలహీనంగా తమను ఎదుర్కొలేని స్థితిలో ఉన్నారని, ఎన్నికలలో తమ గెలుపు నూటికి నూరు శాతం ఖాయమని తెలిసి ఉన్నప్పటికీ ప్రత్యర్ది పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం అభద్రతాభావం అని చెప్పకతప్పదు. 

వీటన్నిటికీ తాజా ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి కనుక మళ్ళీ వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే రాజకీయ వ్యవస్థను ఈవిధంగా భ్రష్టు పట్టిస్తే చివరికి నష్టపోయేది రాజకీయపార్టీలు... వాటి నాయకులే తప్ప ప్రజలు కారు కనుక యధేచ్చగా... నిర్లజ్జగా పార్టీలు ఫిరాయించుకోవచ్చు. దాని కోసం మళ్ళీ ఎటువంటి కుంటిసాకులు చెపుతూ ప్రజలను మభ్యపెట్టవలసిన అవసరం లేదు కూడా.


Related Post