దుబ్బాక పోరు టిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ల మద్యేనా?

October 10, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ, పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ల మద్యే సాగుతున్నట్లు కనిపిస్తోంది. టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత గెలుపు కోసం మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో టిఆర్ఎస్‌ శ్రేణులు గట్టిగా కృషి చేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకొనేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి టిఆర్ఎస్‌ గట్టిగా ప్రచారం చేసుకొంటుంటే, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో నిర్లక్ష్యం, ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకొని టిఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పోరాడుతోంది. 

మంచి వక్తగా పేరున్న బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కానీ ఆయన కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వం గురించి కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలనే చేస్తుండటంతో కొత్తదనం లోపిస్తోంది. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలో ఉండటం ఆ పార్టీ అభ్యర్ధికి ఖచ్చితంగా సానుకూలాంశం అవుతుంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ రఘునందన్ రావుకు అది ఏవిధంగానూ ఉపయోగపడదు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని అందరికీ తెలుసు. దుబ్బాకలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధుల స్వీయ బలాబలాలు, ఆ పార్టీల బలగాలు, వాటి ఎన్నికల ప్రచారసరళి, వ్యూహాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే దుబ్బాక ఉపఎన్నికలలో పోరు ప్రధానంగా టిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ల మద్యే సాగుతుందని చెప్పవచ్చు.


Related Post