హైదరాబాద్‌ అభివృద్ధికి నిదర్శనంగా మరో అంతర్జాతీయ సంస్థ

October 02, 2020


img

హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు తమా కార్యాలయాలను తెరిచాయి. త్వరలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్‌శాక్స్‌ కూడా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. వచ్చే ఏడాది జూన్‌లోగా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు మొదలుపెట్టబోతోందని ఐ‌టి మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్‌ భౌగోళిక పరిస్థితి అనువుగా ఉండటం, అన్ని రంగాలలో నైపుణ్యం ఉన్నవారు నగరంలో లభించడం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు కార్యాలయంలో 6,000 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ కార్యాలయాన్ని 500 మంది ఉద్యోగులతో ప్రారంబించి క్రమంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నామని గోల్డ్‌మన్‌శాక్స్‌ సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ కార్యాలయాలు ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నాయంటే దానర్ధం హైదరాబాద్‌ వ్యాపారసంస్థలకు అన్నివిధాల అనుకూల పరిస్థితులున్నాయని...ప్రభుత్వం అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తోందని... ముఖ్యంగా రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని. 

ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు వస్తుంటే వాటి వెనుకే చిన్నాపెద్ద సంస్థలు కూడా తరలివస్తుంటాయి. దేశవిదేశాల నుంచి చిన్నాపెద్ద సంస్థలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే, ఉద్యోగ ఉపాది అవకాశాలు గణనీయంగా పెరగడమే కాక వాటి నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంటుంది. ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం వలన కొన్ని రంగాలలో అభివృద్ధి ప్రత్యక్షంగా కనబడితే మరికొన్ని పరోక్షంగా అభివృద్ధి చెందుతుంటాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి రియల్ ఎస్టేట్, పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్ లైన్స్, హోటల్, కేటరింగ్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ ఇంకా అనేక రంగాలు. కనుక గోల్డ్‌మన్‌శాక్స్‌ వంటి సంస్థల రాక తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసేదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.


Related Post