బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డికె.అరుణ

September 26, 2020


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ్ళ పార్టీ జాతీయకార్యవర్గాన్ని ప్రకటించారు. దానిలో తెలంగాణ నుంచి డికె.అరుణ, కె.లక్ష్మణ్ లకు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురందేశ్వరి, సత్యకుమార్‌లకు కీలకపదవులు లభించాయి. డికె.అరుణను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించగా, కె.లక్ష్మణ్ బిజెపి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షుడుగా నియమింపబడ్డారు. 

ఏపీకి చెందిన పురందేశ్వరికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సత్యకుమార్‌ బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 

మొత్తం 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు జాతీయ అధికార ప్రతినిధులను, ఇంకా యువమోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా వంటి పలు విభాగాలకు అధ్యక్షులను నియమించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ ఓడిపోయిన తరువాత డికె.అరుణ పార్టీని వీడి బిజెపిలో చేరి మహబూబ్‌నగర్‌ నుంచి బిజెపి అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే ఆమె కూడా రాష్ట్ర బిజెపి పగ్గాలు చేపట్టాలని గట్టిగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి కానీ  బండి సంజయ్‌కు ఆ అవకాశం లభించింది. ఇప్పుడు బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవి లభించడంతో డికె.అరుణ మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవుతారేమో చూడాలి. టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడు చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపిలో చేరిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జాతీయ కార్యవర్గంలో ఆయనకు ఎటువంటి పదవి లభించలేదు. 




Related Post