మునిగిపోయిన పార్టీలో ముసలం... దేనికో?

September 26, 2020


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న సమయంలో అంటే 2014 జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 22 సీట్లు గెలుచుకొంది. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయించడంతో టిడిపి పతనం ప్రారంభమైంది. రేవంత్‌ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో క్రమంగా టిడిపి తెలంగాణలో తన ఉనికినే కోల్పోయి కనీసం ఉపఎన్నికలలో కూడా పోటీ చేయలేని దయనీయస్థితికి చేరుకొంది. 

2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులుపెట్టుకొని పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీకి (టిడిపి) పసుపు మరక అంటుకోవడంతో అది కూడా ఓడిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పతనం కూడా మొదలైంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడే తెలంగాణలో టిడిపి అనే ఓ పార్టీ ఉందనే సంగతి గుర్తొస్తుంటుంది లేకుంటే అసలు టిడిపి ఉనికే కనబడదు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు ఓ వెలుగువెలిగిన టిడిపి ఇప్పుడు తన మనుగడ కోసం పాకులాడుతోంది. 

ఇటువంటి పరిస్థితులలో కూడా పార్టీలో కొందరు నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను ఆ పదవిలో నుంచి తప్పించి కొత్త వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ తమ అధినేత చంద్రబాబునాయుడుకు ఇటీవలే ఓ లేఖ వ్రాశారు. ఆయన పార్టీని అసలు పట్టించుకోకుండా కాంగ్రెస్‌ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని, దాని వలన పార్టీ బలహీనపడుతోందని ఆ లేఖలో వ్రాశారు. కనుక తక్షణం ఎల్ రమణ స్థానంలో చురుకైన వ్యక్తికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని వారు లేఖలో కోరారు. 

చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ కరోనా కారణంగా చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కానీ వారి దృష్టి ఎప్పుడూ ఏపీ టిడిపి, రాజకీయాలపైనే ఉంటుంది తప్ప తెలంగాణ టిడిపిని పట్టించుకొన్న దాఖలాలు లేవు. నిజానికి 2018 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబునాయుడు సూచన మేరకే ఎల్ రమణ తదితరులు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నారు. ఆ తరువాత చంద్రబాబునాయుడు స్వయంగా కాంగ్రెస్‌, టిడిపిల తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు కూడా. కనుక ఎల్ రమణను మార్చాలనుకొంటే మార్చుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారనే కారణంతో తొలగించలేరు. అయినా పూర్తిగా మునిగిపోయిన పార్టీలో ఇప్పుడు ముసలం దేనికి? తుప్పుపట్టిపోయిన సైకిలును ఎవరు మాత్రం నడుపగలరు?


Related Post