కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ మానిక్కంకి ఆదిలోనే అగ్నిపరీక్షలు

September 26, 2020


img

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ రామచంద్ర కుంతియా స్థానంలో నియమింపబడిన మానికం టాగూర్ నేడు తొలిసారిగా హైదరాబాద్‌ వస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో మూడు రోజులు ఉంటారు. ఆయన తమిళనాడుకు చెందిన ఎంపీకావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి, రాష్ట్ర రాజకీయాల గురించి అవగాహన ఏర్పరచుకోవలసి ఉంటుంది కనుక ఈ మూడు రోజులలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యి తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.

ఆయన పార్టీ పరిస్థితిపై, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకొనేలోగానే దుబ్బాక ఉపఎన్నికలు, రెండు శాసనమండలి స్థానాలకు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ కార్పొరేషన్లకు రాబోయే 3-4 నెలలలో వరుసగా ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆయన రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించగానే అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసివస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉపఎన్నికలకు, మండలి అభ్యర్ధులను ఖరారు చేయడం తలనొప్పి వ్యవహారమే అని చెప్పవచ్చు. వరుసగా జరుగబోయే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని ఆయన ఏవిధంగా సిద్దం చేస్తారో చూడాలి.

కేంద్రప్రభుత్వం తెస్తున్న వ్యవసాయబిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఈ నెల 28న నాంపల్లిలో గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించబోతోంది. దానిలో ఆయన పాల్గొంటారు.


Related Post