జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత కేటీఆర్‌కు మళ్ళీ ప్రమోషన్ పక్కా?

September 25, 2020


img

తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ళకు అంటే 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పటికి జీహెచ్‌ఎంసీలో టిఆర్ఎస్‌కు ప్రాధాన్యం ఉండేది కాదు. కారణాలు అందరికీ తెలుసు. హైదరాబాద్‌పై పూర్తి పట్టుసాధించకుండా రాష్ట్రాన్ని పాలించడం కష్టమని గ్రహించిన సిఎం కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచే అనేక వ్యూహాలు, పధకాలు, మార్పులు చేర్పులు చేస్తూ క్రమంగా నగరంలో టిఆర్ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చేయగలిగారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని పూర్తి నమ్మకం కలిగిన తరువాత తాను పక్కకు తప్పుకొని కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు ఆ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యతను అప్పగించారు. 

ఊహించినట్లుగానే టిఆర్ఎస్‌ 150 స్థానాలలో 99 గెలుచుకొంది. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగిరింది. నాన్నకు ప్రేమతో జీహెచ్‌ఎంసీని గెలిచిపెట్టినందుకు ప్రతిగా కేటీఆర్‌కు మరో రెండు మంత్రి పదవులు బహుమతిగా లభించాయి. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. మునిసిపల్, ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పలు ఫ్లైఓవర్లు నిర్మింపజేసారు. ఐ‌టి, పరిశ్రమల మంత్రిగా నగరానికి నగరానికి అనేక ఐ‌టి కంపెనీలను, పరిశ్రమలను రప్పించి నగర ప్రజల మన్ననలను పొందారు. ఆ తరువాత టిఆర్ఎస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ క్రమంగా అటు రాజకీయాలపై, ఇటు ప్రభుత్వం వ్యవహారాలపై మంచి పట్టు సాధించి తిరుగులేని నేతగా ఎదిగి ప్రభుత్వంలో, పార్టీలో కేసీఆర్‌ తరువాత నెంబర్: 2 స్థానంలో నిలిచారు.

ఐదేళ్ళ క్రితం కూడా కేటీఆర్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ ఈసారి ఇంకా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయేందుకు సిద్దంగా ఉన్నారు. నిజానికి మునిసిపల్ మంత్రి పదవితో కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ సమస్యలు, ప్రజల అవసరాల గురించి తెలుసుకొనేందుకు చాలా బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. కనుక ఈసారి అలవోకగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోనేందుకు సిద్దపడుతున్నారు. పార్టీ నాయకులతో సమాలోచనలు చేస్తూ వారిని కూడా ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఆయనే స్వయంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పార్టీ వ్యూహాలు రూపొందిస్తున్నారు. 

శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు టిఆర్ఎస్‌ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులతో చాలా బలహీనపడిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ మరింత బలహీనంగా ఉంది. బిజెపి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కనుక ఆ రెండు పార్టీలను ఎదుర్కోవడం కేటీఆర్‌కు పెద్దకష్టం కాకపోవచ్చు. కనుక ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా కేటీఆర్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ ఘనవిజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

గత ఎన్నికలలో గెలిచినందుకు రెండు మంత్రి పదవులతో ప్రమోషన్ అందుకొన్న కేటీఆర్‌, ఈసారి గెలిస్తే డెప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించవచ్చునని అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఆయన రాజకీయ అప్రెంటిస్ (శిక్షణ) కూడా పూర్తవుతుంది కనుక ముఖ్యమంత్రి పదవి పొందేందుకు అన్నివిధాల అర్హత సంపాదించుకోగలరు.


Related Post