దుబ్బాకలో టిఆర్ఎస్‌ బిజెపిని ఎందుకు టార్గెట్ చేస్తోందో?

September 24, 2020


img

రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మద్య ఉంటుందని అందరికీ తెలుసు. కనుక త్వరలో జరుగబోయే దుబ్బాక ఉపఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలే తలపడతాయని భావించవచ్చు. కానీ దుబ్బాకలో పర్యటిస్తున్న మంత్రి హరీష్‌రావు ఎక్కువగా కేంద్రప్రభుత్వాన్ని..బిజెపినే విమర్శిస్తుండటం ఆలోచించవలసిన విషయమే. అంటే దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపియే టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారా?అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదా?లేక కాంగ్రెస్ పార్టీ ఇంకా దుబ్బాకలో హడావుడి మొదలుపెట్టలేదు కనుకనే దాని గురించి మాట్లాడటం లేదా?అనే సందేహాలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి. 

“జీఎస్టీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటాను ఇవ్వకుండా మోసం చేస్తోందని, వ్యవసాయ బోర్లకు మీత్రాలు బిగించి రైతులను కూడా దోచుకోవాలనుకొంటోందని, కనుక కేంద్రానికి బుద్దిచెప్పాలంటే దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపిని చిత్తుగా ఓడించాలని, రైతుల సంక్షేమం కోసం పరితపిస్తున్న సిఎం కేసీఆర్‌ను చూసి టిఆర్ఎస్‌కే ఓట్లేసి గెలిపించాలని,” మంత్రి హరీష్‌రావు గట్టిగా చెపుతున్నారు. “మీటర్లు కావాలంటే...బీజేపీకి ఓటు వేసుకోండి కానీ వద్దనుకొంటే మన కేసీఆర్ సారూ...టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయండి,” అని హరీష్‌రావు నొక్కి చెపుతున్నారు. 

దుబ్బాక ఉపఎన్నికలలో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో, దుబ్బాక టిఆర్ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరో ఒకరిని ఆకర్షించి దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయిద్దామని ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బహుశః అందుకే హరీష్‌రావు బిజెపిని టార్గెట్ చేస్తున్నారేమో? 


Related Post