కొత్త రెవెన్యూ చట్టం కోసం ఇంత హడావిడి అవసరమా?

September 24, 2020


img

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ఏవో కొత్త చట్టాలు లేదా చట్ట సవరణలు చేస్తూనే ఉంటాయి. పరిపాలన ప్రక్రియలో అవి సాధారణ చర్యలు మాత్రమే. వాటిలో కొన్ని ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపవచ్చు లేదా అసలు చూపకపోవచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలు, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

కేంద్రప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలతో రైతులకు చాలా మేలు కలుగుతుందని ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, బిజెపి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో కూడా రైతులకు మేలు కలుగుతుందని సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు గట్టిగా చెపుతున్నారు. అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టాలకు జేజేలు పలుకుతూ దేశంలో బిజెపి క్యాడర్ ఎక్కడా ఊరేగింపులు జరుపడంలేదు కానీ కొత్త రెవెన్యూ చట్టంతో సిఎం కేసీఆర్‌ ప్రజలకు చాలా మేలు చేస్తున్నారంటూ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు చాలా హడావుడి చేస్తున్నారు. రాష్ట్రంలో పలుజిల్లాలలో ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతల అధ్వర్యంలో ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళతో భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ సిఎం కేసీఆర్‌ చిత్రపఠాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.

ప్రభుత్వాలన్నాక ఎప్పుడో అప్పుడు ఏవో చట్టాలు చేస్తూనే ఉంటాయి. ప్రజలకు మేలు కలగాలనే ఉద్దేశ్యంతో ఏ ప్రభుత్వామైనా చట్టాలు చేస్తుంటుంది. అది ప్రభుత్వం బాధ్యత కూడా. అందుకే అది ఎన్నుకోబడుతుంటుంది. కానీ కొత్త రెవెన్యూ చట్టం చేసి ప్రజలకు మహోపకారం చేశామని, అదేదో మహాద్భుతమని గొప్పలు చెప్పుకొంటూ టిఆర్ఎస్‌ నేతలు ఊరేగింపులు, పాలాభిషేకాలు చేసుకోవడమే చాలా విడ్డూరంగా ఉంది. 

అసలు కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు ఏవిధంగా మేలు కలుగుతుందో ఆచరణలోకి వస్తే కానీ తెలియదు. ఆ చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందో లేదో తెలియదు. పారదర్శకంగా, చురుకుగా పనులు జరుగుతాయో లేవో ఇంకా తెలీదు. అసలు ఆ కొత్త రెవెన్యూ చట్టంలో ఏముందో...దాంతో ఏమి జరుగబోతోందో తెలియకుండానే టిఆర్ఎస్‌ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగానే ఉంది. ప్రభుత్వం చెపుతున్నట్లు ఒకవేళ దాంతో ప్రజలకు మేలు కలిగితే చాలా సంతోషం. అప్పుడు ప్రజలే సంబురాలు చేసుకొంటారు కదా?

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ ఆలోచన కలిగినప్పుడు కూడా టిఆర్ఎస్‌ ఇదేవిధంగా దాని గురించి గొప్పలు చెప్పుకొని ఏమీ చేయకముందే ‘అడ్వాన్స్‌ క్రెడిట్’ తీసేసుకొంది. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. నేటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీని నూటికి నూరు శాతం అమలుచేయనే లేదు. అందుకు విమర్శలను ఎదుర్కొంటోంది కూడా.  ఇప్పుడూ అదేవిధంగా కొత్త రెవెన్యూ చట్టం పేరుతో ‘అడ్వాన్స్‌ క్రెడిట్’ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఏవిధంగా అంటే...బహుశః త్వరలో జరుగబోయే దుబ్బాక ఉపఎన్నికలను, రెండు శాసనమండలి పదవులకు జరుగబోయే ఎన్నికలను, జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నట్లు భావించవచ్చు. 

టిఆర్ఎస్‌ ఎన్నికల వ్యూహాల ముందు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌, బిజెపిలు నిలబడలేకపోతున్నాయని తెలుసు. అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సిద్దాంతంతో ప్రతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎదుర్కొనే అలవాటున్న టిఆర్ఎస్‌, కొత్త రెవెన్యూ చట్టానికి డప్పు కొట్టుకొంటూ అందుకు సన్నాహాలు చేసుకొంటునట్లుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ప్రజలు సంబురాలు చేసుకోవాలనే ఓ నూతన సాంప్రదాయాన్ని టిఆర్ఎస్‌ సృష్టించిందని చెప్పక తప్పదు.


Related Post