ఏపీ ప్రజలకు మాత్రమే ప్రత్యేక వడ్డింపు!

September 19, 2020


img

ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా అప్పులు తెస్తూ వారానికో కొత్త సంక్షేమ పధకాన్ని ప్రకటిస్తూ ప్రజలకు డబ్బులు పంచిపెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా ఏమాత్రం వెనుకంజవేయట్లేదు. ఆదాయం సున్నా వ్యయం 100 అన్నట్లు సాగుతున్నందున అదనపు ఆదాయం కోసం మద్యం ధరలు పెంచుకోక తప్పలేదు. తాజాగా పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వాటిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు ఇది అదనం. ఈ సెస్ ద్వారా సుమారు రూ.600 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయడానికి ఈ సెస్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. కానీ అప్పుల ఊబిలో మునిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, సంక్షేమ పధకాలకు ఆదాయం సమకూర్చుకోవడానికే ఈ ప్రత్యేక వడ్డింపుకు పూనుకొందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుండటం విశేషం. 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలు భరించలేనంతగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ అదనపు వడ్డింపుతో ప్రజలపై మరింత భారం పడనుంది. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలను రాష్ట్రానికి రప్పించి ఆదాయవనరులను సృష్టించినట్లయితే ప్రజలు వారంతటవారు ఆదాయం సంపాదించుకోగలరు. కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా ప్రజలను పనిచేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు పంచిపెడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రకరకాల పధకాలతో ప్రభుత్వం డబ్బు పంచిపెడుతుంటే లబ్దిదారులు ఆనందంగా తీసుకొంటున్నారు. కానీ వారిలో కూడా చాలా మంది ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఆదాయం లేకుండా ప్రభుత్వం ఈవిధంగా ఎంతకాలం...ఎంతమందికి… ఎంత డబ్బు పంచిపెట్టగలదు? అని ప్రశ్నిస్తున్నారు. ఒకచేత్తో ఇచ్చి మళ్ళీ ఈవిధంగా మరోచేత్తో వసూలు చేసుకోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతుండటంతో ఆ భారం మిగిలిన ప్రజలందరూ మోయవలసివస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం ‘సంక్షేమ రాజ్యం’ ఫార్ములాతో ముందుకు సాగిపోతోంది. 


Related Post