భారత్‌ మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదు: బిల్‌గేట్స్

September 16, 2020


img

కరోనా వ్యాక్సిన్‌ను ఏ దేశం తయారుచేసినప్పటికీ, యావత్ ప్రపంచదేశాలకు సరిపడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కేవలం భారత్‌కు మాత్రమే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. కనుక కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాకు ప్రపంచదేశాలన్నీ భారత్‌కు సహకరించాలని ఆయన అన్నారు. తద్వారా నిరుపేద దేశాలకు కూడా వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ అందించగలుగుతామని బిల్‌గేట్స్ చెప్పారు. 

భారత్‌లో భారత్‌ బయోటెక్ వంటి కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది కనుక ముందుగా వ్యాక్సిన్‌ తయారుచేసిన దేశాలు దానిని భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సహకరించాలని బిల్‌గేట్స్ విజ్ఞప్తి చేశారు. భారత్‌లో కొవాక్సిన్, కోవిషీల్డ్, నోవావాక్స్, సఫోనీ, జాన్సన్ & జాన్సన్‌ల వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలలో మొత్తం 113 కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిద దశలలో ఉన్నాయని అవన్నీ 2021 మార్చిలోగా తుదిదశకు చేరుకోవచ్చునని బిల్‌గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

భారత్‌లో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నందున కరోనా కట్టడి చేయడం కొంచెం కష్టమే కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా సమర్ధంగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాబోయే రెండు-మూడు నెలలు భారత్‌కు ఎంతో కీలకమని బిల్‌గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌లో మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలలో ఉన్న వందలాది ఫార్మా కంపెనీలు చాలాకాలంగా ప్రపంచదేశాలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నాయి. నాలుగు నెలల క్రితం అమెరికాలో కరోనా విజృంభించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అభ్యర్ధన మేరకు భారత్‌ 50 మిలియన్ డోసుల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేయడమే అందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

ఇప్పుడు భారత్‌ కంపెనీలే ప్రపంచదేశాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా చేయబోతున్నాయని బిల్‌గేట్స్ స్వయంగా చెప్పడం ఫార్మా రంగంలో భారత్‌ సామర్ధ్యానికి మరో గొప్ప నిదర్శనంగా భావించవచ్చు. 

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్ కంపెనీ, పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాతో సహా దేశంలో పలు కంపెనీలు చిరకాలంగా భారీ ఎత్తున రకరకాల మందులను, వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసి ప్రపంచదేశాలకు అందిస్తున్నాయి.


Related Post