అటు పాక్‌...ఇటు చైనా...

September 16, 2020


img

గత ఆరు నెలలుగా భారత్‌-చైనా సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకపక్క చైనా అక్రమంగా భారత్‌ భూభాగంలోకి జొరబడి అది తమదేనని వాదిస్తూ యుద్ధానికి కాలుదువ్వుతుంటే, మరోపక్క పాకిస్థాన్‌ కూడా భారత్‌లోని కశ్మీర్, జునాగడ్ ప్రాంతాలను తమవేనని పేర్కొంటూ పాక్‌ చిత్రపఠం (మ్యాప్)న్ని విడుదల చేసింది. రష్యాలో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో భారత్‌ ప్రతినిధిగా పాల్గొన్న జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ పాక్‌ వైఖరిపై నిరసన తెలియజేస్తూ సమావేశం నుంచి వాకవుట్ చేసి వెళ్ళిపోయారు. ముందుగా ఈ విషయాన్ని సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న రష్యాకు తెలియజేసి సమావేశం నుంచి నిష్క్రమించారు.

కశ్మీర్‌ను కబళించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పాక్‌ అది సాధ్యం కాకపోవడంతో దశాబ్ధాలుగా కశ్మీర్‌లో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూ వారి అండదండలతో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ సమస్యకు మోడీ ప్రభుత్వం అనూహ్యమైన రీతిలో పరిష్కరించింది. వేర్పాటువాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరువాత జమ్ముకశ్మీర్‌ నుంచి లద్దాక్‌ను వేరు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో వేర్పాటువాదులకు చెక్ పెట్టింది. ఇప్పుడు కశ్మీర్‌, లద్దాక్‌ కేంద్రపాలిత ప్రాంతాలు కావడంతో అవి పూర్తిగా కేంద్రం కనుసన్నలలో ఉన్నాయి. దాంతో అక్కడి వేర్పాటువాదులు ఇప్పుడు నోరెత్తడానికి సాహసించలేకపోతున్నారు. 

కేంద్రప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయాలతో కశ్మీర్‌లో అకస్మాత్తుగా రాజకీయ పరిస్థితులు మారడంతో ఏమి చేయాలో పాలుపోని పాకిస్థాన్‌ అతితెలివి ప్రదర్శిస్తూ కశ్మీర్, జునాగడ్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ చిత్రపఠాన్ని విడుదల చేసింది. దాని వలన భారత్‌కు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ, పాక్‌ చర్యను అంతర్జాతీయ వేదికలపై ఖండించకపోతే అవి పాక్‌ భూభాగాలేనని అంగీకరించినట్లవుతుంది. కనుక అజిత్ దోవల్ వెంటనే ఖండించారు. కేంద్రప్రభుత్వం కూడా దీనిపై పాకిస్థాన్‌కు నిరసన తెలుపుతూ లేఖ వ్రాసే అవకాశం ఉంది. 


Related Post