కేసీఆర్‌ ఒకటి కోరుకొంటే...జరుగుతున్నది మరోటి!

September 15, 2020


img

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో పోరాడిన సిఎం కేసీఆర్‌ ఆ తరువాత రాష్ట్రాల హక్కుల కోసం నేటికీ కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలకు మరిన్ని హక్కులు, అధికారాలు ఇవ్వాలని, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి కొన్ని రంగాలను రాష్ట్రాలకే వదిలిపెట్టాలని సిఎం కేసీఆర్‌ పదేపదే కోరుతున్నారు. అయితే ఆయన విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకొన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ సిఎం కేసీఆర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా కేంద్రంపై ఏదో రూపంలో ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. రాష్ట్రాలకు మరిన్ని హక్కులు, అధికారాలు, స్వేచ్చ కావాలని కోరుతుంటే, కేంద్రప్రభుత్వం కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్రాల హక్కులను హరించివేసేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. 

ఈరోజు శాసనసభలో కొత్త విద్యుత్ చట్టం స్వల్పకాలిక చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఈ కొత్త చట్టం చాలా లోపభూయిష్టంగా ఉంది. చాలా ప్రమాదకరమైనది కూడా. దీంతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని హరించివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లుంది. ఈ చట్టం అమలులోకి వస్తే రాష్ట్రంలో ప్రతీ వ్యవసాయ కనెక్షన్‌కు తప్పనిసరిగా మీటరు బిగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 26 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వాటన్నిటికీ మీటర్లు బిగించాలంటే రూ.700 కోట్లు ఖర్చవుతుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేస్తోంది. మీటర్లు బిగించినప్పటి నుంచి ఇంక నెలనెలా రీడింగులు తీస్తూ రైతులను బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలవుతుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక సంస్కరణలు చేపట్టడంతో రాష్ట్రంలో విద్యుత్ రంగం స్వయంప్రతిపత్తి సాధించగలిగింది. కానీ కొత్త విద్యుత్ చట్టం అమలులోకి వస్తే తెలంగాణలో ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. పార్లమెంటులో కూడా మేము ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తాము,” అని అన్నారు. అనంతరం కొత్త విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.


Related Post