కాంగ్రెస్‌ను ముంచుతున్నదెవరు?

September 12, 2020


img

2014 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ మునుగుతున్న టైటానిక్ షిప్పు మాదిరిగానే కొంచెం కొంచెం మునుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రాహుల్‌ గాంధీ అస్త్రసన్యాసం చేసిన తరువాత పార్టీలో వేరెవరైనా పార్టీ పగ్గాలు చేపట్టాలని చెపుతూనే...ఎవరినీ చేపట్టనీయకుండా తెర వెనుక రాజకీయాలు చేయడంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీయే నేటికీ పార్టీని నడిపించవలసివస్తోంది. 

నాయకత్వ సమస్య వలన పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని పార్టీలో అందరికీ తెలిసి ఉన్నప్పటికీ పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు అందరూ మౌనంగా ఉండిపోయారు. చివరికి పార్టీలో 21 మంది సీనియర్లు కూడబలుక్కొని ధైర్యం చేసి కొన్నాళ్ళ క్రితం సోనియా గాంధీకి ఓ లేఖ వ్రాశారు. పార్టీలో అధ్యక్ష పదవితో సహా జిల్లా స్థాయి వరకు సమూలంగా ప్రక్షాళన చేయాలని లేకుంటే మరో 50 ఏళ్ళు ప్రతిపక్ష బెంచీలలోనే కూర్చోవలసి వస్తుందని వారు తమ అధిష్టానాన్ని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌ టైటానిక్ షిప్పు మంచు పర్వతంవైపు దూసుకువెళుతోందని, గుద్దుకొని మునిగిపోయే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసినందుకు యువరాజవారు మేల్కొని కాంగ్రెస్‌ నౌకను కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా తమను అప్రమత్తం చేసినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువరాజవారి ఆగ్రహానికి గురైన కొంతమందిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతటితో ఆగలేదు...వారి సూచనలను పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుగా భావించి గులాంనబీ ఆజాద్ వంటి పలువురు సీనియర్స్ రెక్కలను సోనియా గాంధీ నిన్న కత్తిరించేశారు! 

పనిలోపనిగా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న రణదీప్ సింగ్‌ సుర్జేవాలకు ప్రమోషన్స్ ఇచ్చేశారు. ప్రియాంకా వాద్రాకు ఉత్తరప్రదేశ్ పూర్తి బాధ్యతలు అప్పగించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎప్పటికీ తమ కుటుంబ సభ్యుల కనుసన్నలలోనే నడవాల్సి ఉంటుందని, వ్యతిరేకించినవారి తోకలు కత్తిరించేస్తామని స్పష్టమైన హెచ్చరిక పంపినట్లు భావించవచ్చు. 

సోనియా గాంధీ ఆరోగ్యకారణాలతో పార్టీని నడిపించలేని స్థితిలో ఉన్నారు. ఈ మాట ఆమే స్వయంగా చెపుతున్నారు. పార్టీలో సీనియర్లే తన నాయకత్వ లక్షణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందునో లేదా మునిగిపోతున్న కాంగ్రెస్‌ టైటానిక్ షిప్పును తాను రక్షించలేనని గ్రహించినందునో రాహుల్‌ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్దంగా లేరు. ప్రియాంకా వాద్రా కూడా ఇంచుమించు అవే కారణాలతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించడం లేదు. వారు ముగ్గురూ పార్టీ పగ్గాలు చేపట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ బయటివారెవరినీ ఆ ముళ్ళ కిరీటం ధరించేందుకు వారు అంగీకరించకపోవడం గమనిస్తే, పార్టీ పూర్తిగా మునిగిపోతున్నా పరువాలేదు పార్టీపై పెత్తనం మాదే ఉండాలి అని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. కనుక సోనియా, రాహుల్, ప్రియాంకాల వలననే కాంగ్రెస్ పార్టీ ఏదో ఓ రోజు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post