తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక రాజకీయాలు

September 11, 2020


img

రాష్ట్ర బిజెపి నేతలు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని పట్టుబడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ స్పందించలేదు. అసలు బిజెపి దాని కోసం అంతగా ఎందుకు పట్టుబడుతోంది?ప్రభుత్వాన్ని ఎవరైనా వేలెత్తి చూపితేనే వారిపై నిప్పులు చెరిగే టిఆర్ఎస్‌, రాష్ట్ర బిజెపి నేతలు ఏటా ఇంత హడావుడి చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉండిపోతోంది?అనే సందేహాలు కలగడం సహజం. 

 ఆనాడు నవాబులు, రజాకార్ల ఆరాచాకలకు బలైన తెలంగాణ ప్రజలకు సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ చొరవతో సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని, కనుక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా  జరపాలని బిజెపి నేతల వాదన. అయితే బిజెపి డిమాండ్‌కు అదొక్కటే కారణం కాదు. హిందుత్వ అజెండాతో పనిచేసే బిజెపి దీంతో రాష్ట్రంలో హిందువులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తూనే, మజ్లీస్‌తో దోస్తీ చేస్తున్న టిఆర్ఎస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తోంది. అందుకే బిజెపి నేతలు ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మజ్లీస్‌కు దాసోహం అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తుంటారు.         

ఒకవేళ బిజెపి ఒత్తిడికి తలొగ్గి టిఆర్ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరిపితే మజ్లీస్ పార్టీ  దూరం అవుతుంది. దాంతోపాటే ముస్లింలు కూడా దూరం అవుతారనే భయం చేత ప్రభుత్వం వెనకాడుతోందని భావించవచ్చు. ఈవిషయంపై టిఆర్ఎస్‌ నేతలు బిజెపితో వాదోపవాదాలకు దిగితే, టిఆర్ఎస్‌ ఎంతో కొంత నష్టపోతుంది. బిజెపికి ఎంతో కొంత లబ్ది కలుగుతుంది. అందుకే రాష్ట్ర బిజెపి నేతలు ఎంత హడావుడి చేస్తున్నా ఈ అంశంపై టిఆర్ఎస్‌ మౌనంగా ఉండిపోతోందని చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ యొక్క ఈ బలహీనత బిజెపి నేతలకు కూడా బాగా తెలుసు. నిజానికి బిజెపి కూడా అదే కోరుకొంటోందేమో?ఎందుకంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపనంతవరకే బిజెపి ఇలా హడావుడి చేస్తూ తెలంగాణ ప్రజలను ముఖ్యంగా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసుకోగలదు. ఒకవేళ టిఆర్ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు సిద్దపడితే అప్పుడు టిఆర్ఎస్‌ కూడా బిజెపికి పోటీగా తయారవుతుంది. కానీ టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లిం ఓటుబ్యాంకును దూరం చేసుకొనే సాహసం ఎన్నటికీ చేయలేదు కనుక బిజెపి ఏటా దీంతో హడావుడి చేసుకొనే వెలుసుబాటు లభిస్తోందని భావించవచ్చు.


Related Post