వీఆర్వోలను బలిపశువులు చేశారు: జీవన్ రెడ్డి

September 11, 2020


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీఆర్వో వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టం తదితర అంశాలపై సునిశితంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఆ తప్పును వీఆర్వోలపైకి నెట్టివేసి వారిని అవినీతిపరులుగా ముద్రవేసి బలిపశువులను చేసి చేతులు దులుపుకొంది. రెవెన్యూశాఖలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వం గుర్తిస్తే ఇంతకాలం ఎందుకు ఉపేక్షించింది? విచారణ జరిపించి బాధ్యులను...వారి వెనుకున్న బడాబాబులను గుర్తించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పైగా ఒకేసారి 6,000 మంది వీఆర్వోలను వేరే శాఖలలోకి సర్దుబాటు చేయడం వలన ఆ మేరకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి కనుక నిరుద్యోగులు నష్టపోతారు.  2017లో ఏకధాటిగా 100 రోజులలో సమగ్ర భూసర్వే చేయించామని, భూరికార్డులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతిని అంతం చేశామని  గొప్పలు చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని చెపుతూ వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తుండటాన్ని ఏమనుకోవాలి?ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సిఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నారని భావిస్తున్నాను. ఇదివరకు భూసర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసిన తరువాత రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుపేద రైతులకు ఇంతవరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మరోసారి భూసర్వేకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈసారి ఎంతమంది రైతులు నష్టపోతారో?ధరణి వెబ్‌సైట్‌లో రాష్ట్రంలో భూయజమానుల వివరాలన్నీ పెడతామని చెపుతున్న సిఎం కేసీఆర్‌, దానిలో తనవి, తన కుటుంబ సభ్యులందరి పేరున ఉన్న వందల ఎకరాల భూముల వివరాలను కూడా పెడతారా లేదా?” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.


Related Post