కొత్త రెవెన్యూ చట్టంలో ముఖ్యాంశాలు

September 09, 2020


img

ఇవాళ్ళ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లు, కొత్త రెవెన్యూ చట్టానికి సంబందించిన బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఆ బిల్లులోని కొన్ని ముఖ్యాంశాలను సభ్యులకు వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

1. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినా వీఆర్వోలకు వేరే శాఖలలో సమానస్థాయిలో స్కేల్ ఉద్యోగులుగా బదిలీలు చేస్తాము. వారి ఉద్యోగాలకు ఢోకా లేదు. 

2.  రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులు రద్దు చేయబడతాయి. వాటి స్థానంలో 16 ట్రిబ్యూనల్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. 

3. ఇకపై తహసిల్ధారులు జాయింట్ సబ్ రిజిస్టార్లుగా వ్యవహరిస్తారు.   

4. ఇకపై భూములు వ్యవసాయ భూములను జాయింట్ సబ్ రిజిస్టార్లు, వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్స్ చేస్తారు. 

5. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే ఆ వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో అప్‌తాజా అప్‌డేట్స్ అవుతుంటాయి కనుక కొనుగోలు, అమ్మకందారులు ఆ వివరాలను స్వయంగా పరిశీలించుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

6. పట్టాదార్ పాసుపుస్తకమే భూయాజమాన్యపు పత్రం లేదా హక్కుల పత్రంగా పరిగణించబడుతుంది. 

7. పాసు పుస్తకంలో భూయజమానులు, వారి పూర్తి వివరాలు, భూమికి సంబందించిన పూర్తి వివరాలు స్పష్టంగా పేర్కొనబడతాయి. 

8. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే ఆటోమేటిక్‌గా మ్యూటేషన్ జరిగిపోతుంది.

9. రాష్ట్రంలో మళ్ళీ సమగ్ర భూసర్వే చేయించి డిజిటల్ రికార్డ్ చేయిస్తాము. ప్రతీ గ్రామంలో ఆ హక్కుల డిజిటల్ రికార్డులను అందుబాటులో ఉంచుతాము. 

10. ఈసారి భూసర్వేను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సరిహద్దులు రూపొందిస్తాము. దాంతో ఇకపై సరిహద్దులను చెట్లు, పుట్టలు, గట్టుల సాయంతో ఉజ్జాయింపుగా లెక్కలు తీయకుండా నూటికి నూరుశాతం ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు సరిహద్దుల విషయంలో ఎవరికీ అయోమయం ఉండదు. ఒకరి భూమిని మరొకరు దురాక్రమణ చేస్తే ఆ విషయం వెంటనే సులువుగా గుర్తించవచ్చు. 

11. తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ జీవితకాలం ఉపయోగపడేలా కులదృవీకరణ సర్టిఫికెట్లు ఇస్తాం. వాటితో పాటు డేటా బేస్ ఆధారంగా ఆదాయ దృవీకరణ సర్టిఫికెట్లు కూడా ఇస్తాం. 

భూ బకాసురులు, భూ మాఫియా, అవినీతి లంచగొండి అధికారులు, ఉద్యోగుల నుంచి రైతులు, ప్రజలందరికీ, వారి భూములకు రక్షణ కవచంగానే ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించాము. కనుక ఇకపై ఎవరూ తమ భూముల గురించి భయపడనవసరం లేదు. లంచగొండి అధికారుల చుట్టూ తిరగక్కరలేదు.


Related Post