కేసీఆర్‌కు అంత కోపం ఎందుకో అర్ధం కాదు: అక్బరుద్దీన్

September 09, 2020


img

మజ్లీస్-టిఆర్ఎస్‌లు మిత్రపక్షాలని అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ్ళ సిఎం కేసీఆర్‌, మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీల మద్య జరిగిన వాదోపవాదనలు చూస్తే ఆ రెండు పార్టీలకు మద్య దూరం పెరిగిందా? అనే అనుమానం కలుగకమానదు. ఎందుకంటే ఇదివరకు ఆ రెండు పార్టీల సభ్యులు సభలో ఏమి మాట్లాడినా ‘శభాష్...శభాష్’ అంటూ పరస్పరం ప్రశంసించుకోవడమే తప్ప ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొన్న దాఖలాలు లేవు. కానీ ఇవాళ్ళ శాసనసభలో కరోనా సంబందిత అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ముందు మంత్రి ఈటల రాజేందర్‌ సమర్పించిన నివేదికపై అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. అది రోజూ ప్రకటిస్తున్న హెల్త్ బులెటిన్‌లాగే అసమగ్రంగా ఉంది తప్ప దానిలో కొత్తగా ఏమీ లేదని విమర్శించారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య, ఆరోగ్య, మునిసిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలపకపోవడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలను సంప్రదించకపోవడాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు.

అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలపై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, “సభకు సమర్పించే నివేదికలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన ప్రతీ అంశం గురించి వ్రాస్తే అదో మహాభారతం అవుతుంది. అందుకే దానిలో ముఖ్యమైన అంశాలను మాత్రమే పేర్కొన్నాము. దానినీ మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ దానినీ తప్పు పట్టడం సరికాదు. కావాలంటే సభ్యులకు ఆ సమాచారమంతా వ్యక్తిగతంగా అందజేస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలోనే వైద్యులు, హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ జవాబుపై అక్బరుద్దీన్ ఓవైసీ మళ్ళీ అసహనం వ్యక్తం చేశారు. “నేను కరోనా వారియర్స్ ను సభాముఖంగా గౌరవించాలని చెపితే ముఖ్యమంత్రిగారికి ఎందుకు కోపం వస్తోందో నాకు అర్ధం కావడం లేదు. పైగా మహాభారత్ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు,” అని బదులిచ్చారు. 

మద్యలో స్పీకర్ కలుగజేసుకొని ఇక ప్రసంగం ముగించాలని కోరడంతో అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహంతో ఊగిపోయారు. “రాష్ట్రానికి సంబందించిన ఒక ముఖ్యమైన సమస్యను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తుంటే మీరు నా టైమ్ అయిపోయిందంటూ కూర్చోమంటున్నారు. ప్రజాసమస్యల గురించి సభలో మేము మాట్లాడకూడదు... ప్రభుత్వం వినకూడదు అని అనుకొంటే అలాగే చేద్దాం. నేనింక మాట్లాడను...మీకు తోచినట్లు మీరు చేసుకోండి...” అంటూ నిరసనగా సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీని టిఆర్ఎస్‌ ప్రభుత్వం భుజానికెత్తుకొన్నప్పటి నుంచి మజ్లీస్ అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. కానీ సిఎం కేసీఆర్‌ అది పట్టించుకోకుండా ముందుకువెళుతున్నందున టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై మజ్లీస్ ఈవిధంగా ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేస్తోందేమో?


Related Post