పీవీకి భారత్‌ రత్న...టిఆర్ఎస్‌ తీర్మానం... మజ్లీస్ వ్యతిరేకం

September 08, 2020


img

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు మజ్లీస్ పార్టీ మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటమే కాక సిఎం కేసీఆర్‌, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీల మద్య మంచి సఖ్యత కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం తీసుకొనే చాలా నిర్ణయాలకు మజ్లీస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంటుంది. అయితే మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డును ఇవ్వాలని కోరుతూ ఇవాళ్ళ శాసనసభలో టిఆర్ఎస్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి మజ్లీస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకవుట్ చేయడం విశేషం. మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించగా, టిఆర్ఎస్‌పై నిత్యం కత్తులు దూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించింది. కారణం అందరికీ తెలుసు. స్వర్గీయ పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడమే. మజ్లీస్ వాకవుట్ చేసిన తరువాత ఆ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించి సభను రేపటికి వాయిదా వేశారు. 

పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చివేయబడింది కనుక మజ్లీస్ పార్టీ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటుంది. తాము వ్యతిరేకిస్తున్న వ్యక్తిని టిఆర్ఎస్‌ ప్రభుత్వం హటాత్తుగా భుజానికెత్తుకొని ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించినప్పుడే మజ్లీస్ పార్టీ ఉలిక్కి పడింది. కానీ టిఆర్ఎస్‌ దోస్తీ కారణంగా ఏదో మొక్కుబడిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. మళ్ళీ ఇవాళ్ళ కూడా అలాగే మొక్కుబడిగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వాకవుట్ చేసి బయటపడింది. 

స్వర్గీయ పీవీని టిఆర్ఎస్‌ ప్రభుత్వం భుజానికెత్తుకోవడం మజ్లీస్ నేతలు జీర్ణించుకోవడం కష్టమే కానీ సిఎం కేసీఆర్‌తో దోస్తీ, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌనం వహించక తప్పలేదు. టిఆర్ఎస్‌ కూడా తన రాజకీయ అవసరాలు లేదా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ తీర్మానం చేస్తోందని,  కేంద్రప్రభుత్వం ఆ తీర్మానాన్ని పట్టించుకోదని కూడా మజ్లీస్ పార్టీకి తెలుసు. అందుకే మొక్కుబడిగా వ్యతిరేకించింది. ఇదంతా  మజ్లీస్ పార్టీకి ఇష్టంలేదని సిఎం కేసీఆర్‌కు కూడా తెలుసు కానీ ఈ అంశంపై మజ్లీస్ పార్టీ తమను అడ్డుకోబోదని తెలుసు కనుకనే ముందుకు సాగారనుకోవచ్చు. 

ఇంతకీ సిఎం కేసీఆర్‌కు హటాత్తుగా స్వర్గీయ పీవీపై ఎందుకు ఇంత ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి? ఆయనను ఎందుకు భుజానికెత్తుకొన్నారు?దాంతో ఆయన ఏమి సాధించాలనుకొంటున్నారు?అనే ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజులలో సమాధానాలు లభించవచ్చు. 


Related Post