సాధారణంగా కోర్టు ధిక్కారనేరాన్ని జిల్లా స్థాయి కోర్టులు సైతం తీవ్రంగా పరిగణించి తదనుగుణంగా శిక్షలు విధిస్తుంటాయి. అదే... సుప్రీంకోర్టునే ధిక్కరిస్తే? ధిక్కరించినందుకు జైలు శిక్ష విధించడానికి సుప్రీంకోర్టు సిద్దపడినప్పటికీ సదరు వ్యక్తి క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తుంటే? సదరు వ్యక్తి దేశంలో పేరు మోసిన న్యాయవాదులలో ఒకరైతే? సుప్రీంకోర్టు అతనికి శిక్ష విధిస్తుందా లేదా? అంటే చట్టప్రకారం విధించింది... ఒక్క రూపాయి జరిమానా మాత్రమే!
సదరు వ్యక్తి పరిచయమే అవసరం లేని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. సుప్రీంకోర్టు పనితీరును విమర్శిస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే చర్యలను తప్పు పడుతూ ఆయన చేసిన మూడు ట్వీట్లు దీనికంతటికి కారణం. సుమారు మూడు నెలలు సుదీర్గ విచారణ తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనను దోషిగా నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించేందుకు సిద్దమైంది. అయినా సుప్రీంకోర్టుకు ఆయన అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి కేసు నుంచి విముక్తి పొందవచ్చని అవకాశం ఇచ్చింది. కానీ దానికీ ఆయన ఒప్పుకోలేదు. తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని, అయినా క్షమాపణ చెపితే నేరం అంగీకరించినట్లే కదా?అని వాదించారు. కనుక ఆయన జైలు వెళ్ళక తప్పదని అందరూ భావించారు.
అదే కనుక జరిగితే వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుందని, న్యాయవ్యవస్థకు కూడా గౌరవంగా ఉండదని పలువురు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాటిపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ్ళ తుదితీర్పు వెలువరిస్తూ, కోర్టుధిక్కార నేరానికి పాల్పడినందుకు ప్రశాంత్ భూషణ్ కుకేవలమ్ ఒక్క రూపాయి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఆయన సెప్టెంబర్ 15లోగా ఆ జరిమానా చెల్లించకపోతే 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని, మూడేళ్ళపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పు చెప్పింది. ఇప్పటికే తెగేవరకు తాడు లాగిన ప్రశాంత్ భూషణ్, శ్రేయోభిలాషులు, సాటి న్యాయవాదులు, న్యాయమూర్తుల సూచన మేరకు ఒక్క రూపాయి జరిమానాను చెల్లించడానికి అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ, “నాకు మన న్యాయవస్థపై అపారమైన గౌరవం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ జరిమానా చెల్లిస్తాను,” అని చెప్పారు.
ఈ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెపితే నేరం అంగీకరించినట్లే అవుతుందని వాదించిన ప్రశాంత్ భూషణ్, ఇప్పుడు ఒక్క రూపాయి జరిమానా చెల్లించడం ద్వారా తన నేరాన్ని అంగీకరించినట్లే కదా?గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత విమర్శలు చేసినందుకు కోల్‌కతా హైకోర్టులో జడ్జిగా పనిచేసిన జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్‌కు (9, మే 2017) ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు కూడా. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ధిక్కరించినందుకు ఆరునెలలు జైలుశిక్ష అనుభవించడం అదే మొదటిసారి. ప్రశాంత్ భూషణ్ కూడా ఇంచుమించు అటువంటి నేరమే చేసి, క్షమాపణ చెప్పడానికి నిరాకరించినప్పటికీ ఒక్క రూపాయి జరిమానాతో ఈ కేసు నుంచి విముక్తి పొందారు.