రెండు రోజుల క్రితమే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పధకాన్ని చాలా ప్రశంసించారు. ఇటువంటి పధకం జాతీయస్థాయిలో అమలుచేయవలసిన అవసరం ఉందన్నారు. రైతు బంధు పధకాన్ని కేంద్రమంత్రి ఇంతగా మెచ్చుకొంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పధకంలో భారీగా అవినీతి జరుగుతోందని ఈరోజు ఆయనకే ఫిర్యాదు చేయడం విశేషం.
దేశంలో రైతుల ఆదాయం పెంచేందుకుగాను కేంద్రప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే ఓ కొత్త పధకాన్ని అమలుచేయబోతోంది. బండి సంజయ్ కేంద్రమంత్రి తోమార్‌ని ఈరోజు ఢిల్లీలో కలిసినప్పుడు దానికి సంబందించి కొన్ని సలహాలు సూచనలు చేసిన తరువాత రైతు బంధు పధకంలో అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేయడంతో, తెలంగాణ రాష్ట్రానికి ‘అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ నిధులు విడుదల చేస్తున్నప్పుడు వాటిని తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని కేంద్రమంత్రి చెప్పారు.