బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు సిబిఐ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటపడుతుండటంతో అంతకు ముందు దర్యాప్తు జరిపి కేసును మూసివేసేద్దామనుకొన్న ముంబై పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయిప్పుడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహజీవనం సాగించిన రియా చక్రవర్తి మత్తుమందులు కావాలంటూ ముంబైలోని డ్రగ్ డీలర్లతో చేసిన వాట్సాప్ ఛాట్‌లను సిబిఐ అధికారులు కనుగొన్నారు. చనిపోయే కొన్ని గంటల ముందువరకు ఆమె అతనితోనే ఉందని సిద్దార్ధ్ పితాని సిబిఐ అధికారులకు తెలియజేశాడు. జూన్ 8వ తేదీన సుశాంత్ సింగ్‌కు ఆమెకు మద్య పెద్ద గొడవ జరిగిందని చెప్పాడు. ఆ తరువాత ఓ ఐటి నిపుణుడు వారి ఇంటికి వచ్చి వారిరువురి సమక్షంలోనే 8 కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను ద్వంసం చేశాడని చెప్పాడు. అయితే వాటిని వారు ఎందుకు ధ్వంసం చేయించారో, వాటిలో ఏముందో తనకు తెలియదని సిద్దార్ధ్ పితాని చెప్పాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు సుశాంత్ మేనేజర్ దీపేష్, వంట మనిషి ధీరజ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాడు. ఆ తరువాత రియా చక్రవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని సిద్దార్ధ్ పితాని చెప్పాడు.
రియా చక్రవర్తికి డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని సిబిఐ గుర్తించగానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కూడా రంగంలో దిగి వారు కూడా ఆమెపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ ఖాతాలో నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు వేరే ఖాతాలలోకి మళ్లించిందని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసిక ఒత్తిడి భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నాడని సింపుల్‌గా చెప్పి ముంబై పోలీసులు కేసును మూసివేయాలనుకొంటే ఇప్పుడు ఇన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కనుక ముంబై పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో నిజాలు బయటపడకుండా మూసివేయాలని ప్రయత్నించినట్లు అర్ధమవుతోంది. ఒకవేళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోలేదని లేదా అతను ఆత్మహత్య చేసుకొనేలా ఎవరో ప్రేరేపించారని లేదా ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినట్లు సిబిఐ నిరూపించగలిగితే నేరస్తులతో పాటు ఈ నేరాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించినందుకు ఈ కేసును దర్యాప్తు జరిపిన ముంబై పోలీసులు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నాడని తప్పుడు పోస్టుమార్టం నివేదిక ఇచ్చినందుకు వైద్యులు కూడా జైలుకు వెళ్లవలసివస్తుంది.