ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు మంచి సమర్దుడైన అధికారి అని అందరూ వినే ఉంటారు. అంతేకాదు...సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పట్ల చాలా స్నేహభావంతో ఉంటూనే వారి చేత కూడా అంతే సమర్ధంగా పని చేయిస్తుంటారు. అందుకే సిఎం కేసీఆర్ తరచూ ఆయనను ప్రశంశిస్తుంటారు. ఆయన నిబద్దతకు దేవుడు ఒకేసారి రెండు పెద్ద పరీక్షలు పెట్టాడు.
శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం రూపంలో ఓ పరీక్ష...తోడబుట్టిన సోదరుడు మరణం మరో పరీక్ష. రెండూ ఆయనకు తీవ్ర మనోవేదనను మిగిల్చాయని వేరే చెప్పక్కరలేదు. ఎప్పుడూ సంస్థ అభివృద్ధి... ఉద్యోగుల సంక్షేమం గురించే ఆలోచిస్తుండే ఆయనకు ప్లాంటులో అగ్నిప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో తొమ్మిదిమంది కళ్ల ముందే సజీవదహనం అయిపోవడం చూసి బోరున విలపించారు. ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే, అదే రోజున ఆయన సోదరుడు శ్రీనివాసరావు మరణించారు. అయినప్పటికీ ఆయన గుండె నిబ్బరం చేసుకొని సోదరుడి అంత్యక్రియలు పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా తన కార్యాలయం చేరుకొని ఆ బాధను దిగమింగుకొంటూ అగ్నిప్రమాదంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన నిబద్దతకి, మనోధైర్యానికి అధికారులు ఆశ్చర్యపోయారు.