కరోనా మహమ్మారి గురించి తెలిసింది కొంతయితే తెలియంది చాలానే ఉంది. కనుక దాని గురించి ఎవరికి తోచినట్లువారు చెపుతుండటంతో సమాజంలో కరోనా గురించి అనేక అనుమానాలు, అపోహలు నెలకొని ఉన్నాయి. చనిపోయినవారి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే వాదన వాటిలో ఒకటి. ఆ కారణంగా ఎవరైనా కరోనాతో చనిపోతే సొంత కుటుంబ సభ్యులే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి భయపడుతున్నారు. దాంతో అందరూ ఉండి కూడా చనిపోయినవారిని అనాధ శవాలలాగ మునిసిపల్ లేదా ఆసుపత్రి సిబ్బంది పూడ్చిపెడుతున్నారు. తాము ఎంతగానో ప్రేమించే ఆత్మీయులు చనిపోవడమే ఎంతో ఆవేదన కలిగిస్తుంటే, కులమతాచారాల ప్రకారం వారి అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోవడం ఇంకా బాధాకరమే.
కరోనా మృతదేహాలను ఆసుపత్రులలో వైద్య నిపుణుల సమక్షంలో పూర్తిగా ప్యాక్ చేస్తుంటారు కనుక అంత్యక్రియలలో పాల్గొన్నవారికి మృతదేహాల ద్వారా కరోనా సోకదని వైద్యులు, వైద్యరంగంలో నిపుణులు పదేపదే చెపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం వారి మాటలను నమ్మడం లేదు. అందుకే నేటికీ కరోనా మృత దేహాలను వారి కులమతాచారాలకు విరుద్దంగా మునిసిపల్, ఆసుపత్రి సిబ్బంది గోతులలో పూడ్చిపెట్టవలసి వస్తోంది.
కరోనా మృతదేహాల గురించి ప్రజలలో నెలకొన్న ఈ అపోహలు, భయాలు తొలగించాలనే మంచి ఉద్దేశ్యంతో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆ తరువాత పరీక్ష చేయించుకొంటే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డి కూడా కరోనా సోకడంతో తండ్రీకొడుకులు ఇద్దరు తిరుపతి రూయా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉంది.