అయితే ప్రభుత్వ వాదనలు తప్పేకదా?

August 26, 2020


img

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం చేస్తున్న వాదనలు పసలేనివని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజూ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌లే నిరూపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా పరీక్షలు పెంచగానే రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. 

కేంద్రప్రభుత్వం, గవర్నర్‌, హైకోర్టు, ప్రతిపక్షాలు కరోనా పరీక్షలు పెంచాలని ప్రభుత్వంపై ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ ఇన్నాళ్లుగా సమర్ధించుకొంది. తత్ఫలితంగా రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్‌ వ్యాపించి అన్ని జిల్లాలకు పాకిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు భారీగా పెంచింది. దాంతో మొన్నటివరకు రోజుకు 1800 మాత్రమే నమోదైన కేసులు ఒకేసారి ఇప్పుడు 3,018కి పెరిగాయి. ఇంతకాలం ప్రభుత్వం రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు చేయకపోవడానికి కారణాలు ప్రజలకీ తెలుసు కనుక ఇప్పుడు వాటి గురించి చర్చించుకోనవసరం లేదు. కానీ  ఇంతకాలం తక్కువ పరీక్షలు చేయడం వలన గోటితో పోయేది గొడ్డలివరకు వచ్చిన్నట్లయింది. మొదట్లోనే తగినన్ని పరీక్షలు చేసి ఉండి ఉంటే రోగుల సంఖ్య పరిమితమయ్యేది కనుక తక్కువ ఖర్చుతో ప్రభుత్వం ఈ సమస్య నుంచి బయటపడగలిగి ఉండేది. కానీ ఆలస్యంగా మేలుకోవడం వలన ఇప్పుడు రోజురోజుకీ కరోనా రోగులు పెరిగినట్లయితే వారికి వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వంపై చాలా ఆర్ధికభారం పడుతుంది.  

పొరుగు రాష్ట్రం ఏపీలో మొదటి నుంచే ప్రతీరోజు భారీగా కరోనా పరీక్షలు చేయిస్తుండటంతో మొదట్లో రోజుకి 10,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడేవి. అవిచూసి ఏపీ ప్రజలు సైతం భయపడేవారు. ఏపీలో కరోనా అదుపు తప్పిందని ఇరుగుపొరుగు రాష్ట్రాలు గుసగుసలు ఆడుకొనేవి. కానీ ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజవేయకుండా నేటికీ ప్రతీరోజు భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా రోగులను సకాలంలో గుర్తించి అందరికీ వైద్యచికిత్సలు అందిస్తుండటం వలన ఇప్పుడు క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అంటే కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం ఆచరిస్తున్న విధానమే సరైనదని స్పష్టమవుతోంది. 

కానీ దేశంలో అన్ని రాష్ట్రాలకు మా విధానాలే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో తప్పటడుగులు వేసిందని రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులే చెపుతున్నాయి. కనుక ఇకపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఇదేవిధంగా ప్రతీరోజు భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా రోగులను గుర్తించి వారికి చికిత్స అందించగలిగితే రాష్ట్రంలో తప్పకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చు.


Related Post