హైదరాబాద్ నగరంలో ప్రభుత్వాసుపత్రులన్నీ కరోనా చికిత్సకు కేటాయించబడటంతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఒక్కటే ప్రస్తుతం అన్ని రకాల వ్యాదులకు వైద్య చికిత్సలు అందిస్తోంది. కనుక దానికి రోగుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది.
ఆసుపత్రి పాత భవనంలోని వార్డులలోకి మురుగునీరు ప్రవహించడంతో జూలై 15వ తేదీన దానిని మూసివేసి, ఆ వార్డులో రోగులను పక్కనే ఉన్న వేరే భవనంలోకి మార్చారు. సచివాలయాన్ని ఆఘమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వం, వార్డులలోకి మురుగునీరు ప్రవహిస్తున్న ఉస్మానియా ఆసుపత్రిని ఇంకా ఎప్పుడు కూల్చి కొత్త భవనాన్ని కడుతుందో ఎవరికీ తెలియదు. ఆసుపత్రి భవనమే కాదు లోపల ఉన్న ఆక్సిజన్ పైపులు కూడా శిధిలావస్థకు చేరుకొన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ చెప్పడం విశేషం.
అదొక్కటే కాదు...ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసిన తరువాత రోగులకు కట్టు కట్టేందుకు బ్యాండేజీలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గాయాలను కడిగేందుకు ఉపయోగించే బేటాడిన్ లేదా స్పిరిట్ వంటివి కూడా లేవని, ఆసుపత్రికి వచ్చేవారిలో నిరుపేదలే ఎక్కువగా ఉంటారు కనుక వారవి కొనుక్కోలేరని చెప్పారు. ఇటీవల ఓ చెయ్యి విరిగిన వ్యక్తికి సిమెంట్ కట్టు కట్టేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేకపోవడంతో ఓ అట్టముక్కను చేతికి కట్టవలసి వచ్చిందంటే ఆసుపత్రి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో నెలకొన్న ఈ సమస్యల గురించి ఉస్మానియా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఆగస్ట్ 18వ తేదీన లిఖిత పూర్వకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
బ్యాండేజీలే కాదు... ఆపరేషన్ థియేటర్స్ లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని, వెంటిలేటర్లు, మానిటర్లు పనిచేయడం లేదని వారు ఫిర్యాదు చేశారు. వార్డులో మురుగునీరు ప్రవహించడంతో ఒకే వార్డులో సాధారణ రోగులను, ఆర్దోపెడిక్ రోగులను కలిపి ఉంచడంతో వారికీ, వారితో పాటు తమకు కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని, కనుక రోగుల మద్య భౌతికదూరం ఉండేవిధంగా వేరే వార్డులు ఏర్పాటుచేసి వాటిలోకి రోగులను మార్చాలని జూనియర్ డాక్టర్లు తమ లేఖలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.నాగేందర్‌ను కోరారు. ఆ లేఖలో వారు ఆసుపత్రిలో వసతుల లేకపోవడం గురించి ఇంకా చాలా ప్రస్తావించారు.
అయితే ఆసుపత్రిలో సరిపడినన్ని మందులు, బ్యాండేజీలు అన్ని ఉన్నాయని ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కొందరు జూనియర్ డాక్టర్లు ఈవిధంగా పిర్యాదులు చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ఆరోపించారు. ఆసుపత్రిలో ఎప్పుడో దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైపులు పాడైపోయిన మాట వాస్తవమేనని అందుకే ఆక్సిజన్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని చెప్పారు. అయితే పాత పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ చెప్పారు. కానీ జూనియర్ డాక్టర్ల సంఘం వ్రాసిన ఈ లేఖ ఉస్మానియా ఆసుపత్రి దీనస్థితికి అద్దం పడుతోంది.