అమెరికాలో మళ్ళీ జాత్యాహంకారం బుసలు కొట్టింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం విన్‌కన్‌సిన్ రాష్ట్రంలో కెనోషా నగరంలో ఓ తెల్లపోలీస్ అధికారి జాకోబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడిపై తుపాకీతో కాల్పులు జరుపడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దృశ్యాన్ని అదే అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో విన్‌కన్‌సిన్‌తో సహా అమెరికాలో పలు రాష్ట్రాలలో ప్రజలు పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల అల్లర్లు, విధ్వంసం చెలరేగింది.
జాకోబ్ బ్లేక్ పొరుగింటిలో నివశిస్తున్న అతని స్నేహితుడు లాడర్‌డేల్ ఏమి చెప్పరంటే, “బ్లేక్ తన ముగ్గురు పిల్లలను కారులో ఉంచి బయటకు వచ్చాడు. అతనికి నా 8 ఏళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం. అతని కోసం ఓ సంచీ నిండా ఏవో బహుమతులు పట్టుకొని వస్తుంటే, మా ఇంటికి సమీపంలో ఇద్దరు మహిళలు ఏదో విషయమై వాదించుకొంటున్నారు. బ్లేక్ కలుగజేసుకొని వారికి సర్దిచెప్పబోతుంటే అదే సమయంలో ముగ్గురు పోలీసులు అక్కడకు వచ్చి అతనిని చుట్టు ముట్టారు. వారు అతనికి తుపాకీ గురిపెట్టి హెచ్చరిస్తున్నప్పటికీ బ్లేక్ ‘నేనే ఏ తప్పు చేయలేదంటూ’ తన కారు ముందు సీటులోకి కూర్చోన్నాడు. దాంతో ఆ ముగ్గురు పోలీసులలో ఒకరు బ్లేక్ వీపుపై అనేకసార్లు తుపాకీతో కాల్చాడు. ఇది చాలా దురదృష్టకర సంఘటన,” అని చెప్పాడు.
పోలీసులు కాల్పులలో తీవ్రంగా గాయపడిన బ్లేక్‌ను సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కెనోషా నగరంలో నల్లజాతీయులు ఎక్కువగా నివశిస్తుంటారు. గత కొన్నేళ్ళుగా వారికీ, తెల్లపోలీసులకు మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని తెలుస్తోంది. బహుశః ఆ కారణంగానే పోలీసులు బ్లేక్‌పై అకారణంగా కాల్పులు జరిపి ఉండవచ్చు.
మూడు నెలల క్రితం (మే25) మిన్నియాపోలిస్ అనే పట్టణంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ళ నల్లజాతీయుడిని ఓ తెల్లపోలీసు మెడపై మోకాలితో అదిమి ఉంచడంతో అతను ఊపిరి ఆడక చనిపోయాడు. అప్పుడూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. మళ్ళీ ఇప్పుడు అటువంటి ఘటనే పునరావృతం కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు (నవంబర్ 3) దగ్గర పడుతుంటే ఇటువంటి ఘటనలు జరుగుతుండటం డోనాల్డ్ ట్రంప్‌కు తీవ్రంగా నష్టం కలిగించవచ్చు. డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జో బిడెన్, ఉపాధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ ఇద్దరూ ఈ ఘటనను ఖండిస్తూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలా హారిస్ భారత్, ఆఫ్రికా మూలాలు ఉన్న మహిళ కావడంతో ఈ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె విమర్శలతో ట్రంప్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రజలు ఏవిధంగా తెర్పు ఇస్తారో తెలీదు కానీ పోలీసులు ఈవిధంగా నల్లజాతీయులతో దురుసుగా ప్రవర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఓటమికి కారకులయ్యేలా ఉన్నారు.