చైనాకు భారత్‌ మరో పెద్ద షాక్

August 22, 2020


img

భారత్‌ శాంతి, సహనాలను అలుసుగా భావించి సరిహద్దుల వద్ద రెచ్చిపోతున్న చైనాకు భారత ప్రభుత్వం వరుసగా షాకులు ఇస్తోంది. ఇదివరకు 59 చైనా మొబైల్ యాప్‌లను రద్దు చేసి మొదటి షాక్ ఇచ్చిన కేంద్రప్రభుత్వం తాజాగా 44 జతల హైస్పీడ్ రైళ్ళ తయారీ, సరఫరా కోసం దాఖలైన టెండర్లను రద్దు చేసి చైనాకు మరోసారి షాక్ ఇచ్చింది. 

చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ యోంగ్జీ ఎలక్ట్రిక్‌ కంపెనీ లిమిటెడ్‌, భారత్‌లోని గురుగ్రామ్‌కు చెందిన పయనీర్‌ ఫిల్‌-మెడ్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఆ టెండర్లలో పాల్గొన్నాయి. వాటిలో అవి ప్రధమస్థానంలో నిలిచాయి. కనుక ఆ భారీ కాంట్రాక్ట్ చైనా సంస్థ దక్కించుకొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్న కేంద్రప్రభుత్వం సూచనల మేరకు ఇదివరకు చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ వారం రోజులలోగా కొత్తగా టెండర్లు ఆహ్వానిస్తామని రైల్వేమంత్రిత్వశాఖ ఓ ట్వీట్ ద్వారా ప్రకటించింది. 

ఇంతకు ముందు జరిగిన టెండర్ల ప్రక్రియలో చైనా జాయింట్ వెంచర్ కంపెనీ తరువాత స్థానాలలో వరుసగా భారత్‌కు చెందిన బీహెచ్ఈఎల్, భారత్‌ ఇండస్ట్రీస్, సంగ్రూర్ ఎల్కక్ట్రోవేవ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మేధా సర్వొ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పవర్ నేటిక్స్ ఎక్వీప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నిలిచాయి. కనుక ఈసారి టెండర్లలో వాటిలో అగ్రస్థానంలో నిలిచిన బీహెచ్ఈఎల్ సంస్థకు ఈ భారీ అవకాశం లభించవచ్చు. 

చైనా కంపెనీని బరిలో నుంచి తప్పించేందుకే ‘మేక్ ఇన్ ఇండియా’ సాకుతో పాత టెండర్లను రద్దు చేసినందున, ఈసారి ఎట్టి పరిస్థితులలో చైనా కంపెనీలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టెండర్లు వేసేందుకు అనుమతించకపోవచ్చు. ఇది చైనాకు చాలా పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు. చైనా వస్తువులను భారతీయులకు అలవాటు చేయడం ద్వారా, భారతీయ పరిశ్రమలు, వివిద సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా, భారత్‌లో వివిద రకాల ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా భారత్‌పై చైనా చాలా పట్టు సాధించింది. కనుక చైనా కనుసన్నలలో భారత్‌ నడుచుకొంటుందని లేకుంటే తన చేతిలో ఉన్న భారత్‌లోని వివిద వ్యవస్థలు, సంస్థల ద్వారా భారత్‌ను కట్టడిచేయవచ్చునని చైనా భ్రమపడి ఉండవచ్చు. కానీ కేంద్రప్రభుత్వం చైనా భ్రమలు తొలగిపోయేలా వరుసగా షాకులు ఇస్తోంది. అయినా ఇప్పటికీ భారత్‌ పట్ల చైనా తీరు మారకపోగా పాకిస్థాన్‌తో కలిసి కశ్మీర్‌ అంశంలో వేలుపెట్టేందుకు సిద్దం అవుతోంది. 

పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక దేశాలలాగా మన దేశంలో కూడా భారీ పెట్టుబడులు పెట్టి భారత్‌ను తన గుప్పెట్లోకి తెచ్చుకొని ఆడించాలనుకొంటున్న చైనాకు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Related Post