తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా సోమాజీగూడ వద్దగల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అత్యంత క్లిష్ట పరిస్థితులలో 40 ఏళ్ళవయసులోనే దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ స్పూర్తితో మనం అందరం ముందుకు సాగాలి. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలి. ఈ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నవారికి జవాబు చెపుదాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ఘోరంగా విఫలమైంది. హైకోర్టు, గవర్నర్ విమర్శిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరుమారడం లేదు. పైగా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చినందుకు గవర్నర్‌పైనే టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండటం సిగ్గుచేటు. ఇకనైనా గవర్నర్ సూచన ప్రకారం రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచి కరోనాను నియంత్రించాలి,” అని అన్నారు.
శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో తన బలం పెంచుకోవాలని ఆరాటపడుతున్న బిజెపికి జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. కానీ ఎన్నికలను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్‌కున్న ప్రత్యేకమైన నేర్పు, శక్తియుక్తులు ముఖ్యంగా అధికారం చేతిలో ఉండటం వలన దానిని ఎదుర్కొని ఓడించడం కాంగ్రెస్, బిజెపిలకు చాలా కష్టమే. కానీ కాంగ్రెస్, బిజెపిలు తమ సామర్ధ్యం నిరూపించుకోవడానికి ఇంతకంటే చక్కటి అవకాశం ఇప్పట్లో రాదు. కనుక అవి కూడా ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు గట్టిగానే ప్రయత్నించడం ఖాయం.