కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడంలేదని, ఒక వైద్యురాలిగా తాను చేసిన పలు సూచనలను కూడా పట్టించుకోలేదంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె విమర్శలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మరికొందరు టిఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. వారు గవర్నర్‌ను విమర్శించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పడుతూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, దాసోజ్ శ్రవణ్ కుమార్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు బుదవారం ఉదయం శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ద వహించాలని గవర్నర్ సూచిస్తే ఆమె సలహాను గౌరవించకపోగా టిఆర్ఎస్ నేతలు ఆమెపై ఎదురుదాడి చేయడం చాలా శోచనీయం. రాష్ట్రానికి ప్రధమ పౌరురాలిగా ఉన్న ఆమె పట్ల టిఆర్ఎస్ నేతలు ఇలాగేనా ప్రవర్తించేది?అయినా ఆమె చెప్పిన దానిలో తప్పేముంది? కరోనా పరీక్షలు పెంచి రోగనిర్ధారణ చేసి వైరస్ వ్యాపించకుండా నివారించమనే కదా ఆమె చెప్పారు? గవర్నర్ పట్ల టిఆర్ఎస్ నేతలు చులకనగా మాట్లాడి ఆమెను అవమానించినందుకు సిఎం కేసీఆర్ ఆమెకు క్షమాపణ చెప్పాలి. ఆమెపై విమర్శలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి. కరోనా కట్టడి విషయంలో హైకోర్టు, గవర్నర్, కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మారకపోవడం చాలా విచారకరం. ఇకనైనా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించినట్లుగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచి, ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు పెంచాలి. గవర్నర్ సూచించినట్లుగా కరోనా రోగులను దోచుకొంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కటిన చర్యలు తీసుకోవాలి. కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలి,” అని అన్నారు.