టిఆర్ఎస్‌లో మళ్ళీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే పాట మొదలైంది. భోధన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మొన్న తన నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి యువనాయకత్వం చాలా అవసరం ఉంది కనుక కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చెందుతుందని టిఆర్ఎస్‌లో యువతరం భావిస్తున్నారు. సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి డిల్లీలో మకాం వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.
నిజానికి సిఎం కేసీఆర్ 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నారు. ఆ విషయం ఆయనే స్వయంగా ఎన్నికల ప్రచారసభలో పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు తిరుగులేదనుకొంటే లోక్‌సభ ఎన్నికలలో సిఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం, పైగా కాంగ్రెస్, బిజెపిలు 5 ఎంపీ సీట్లు గెలుచుకోవడం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అదీగాక...లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి తగినంత మెజార్టీ రాదని, అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గొడుగు క్రింద ఇతర పార్టీలను కూడా గట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తే, అనూహ్యంగా బిజెపి భారీ మెజార్టీతో అధికారంలోకి తిరిగి వచ్చింది. ఈ అనూహ్య రాజకీయ పరిణామాల కారణంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనే ఆలోచనను విరమించుకొన్నారు. మళ్ళీ ఇన్నిరోజుల తరువాత భోధన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ద్వారా పార్టీలో దానిపై చర్చ మొదలైంది. ఒకవేళ టిఆర్ఎస్‌లో మరెవరైనా ఈ ప్రస్తావన చేసినట్లయితే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సిఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు భావించవచ్చు.