భారత్‌లో ఒకే రోజు 66,999 పాజిటివ్ కేసులు నమోదు

August 14, 2020


img

భారత్‌లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోవడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ శరవేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 66,999 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,96,637కి చేరింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 942 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 47,033కి చేరింది. 

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలలో చాలా వరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, యూపీ రాష్ట్రాలలోనే నమోదవుతున్నాయి. మొదట్లో తెలంగాణలో కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యేవి కానీ ప్రభుత్వం చేపడుతున్న పలుచర్యలతో మెల్లగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ పొరుగు రాష్ట్రం ఏపీలో రోజుకి సుమారు 9-10,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు ఏపీలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.          

అయితే దేశంలో ప్రతీరోజూ పాజిటివ్ కేసులు ఎన్ని నమోదవుతున్నప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, మరణాల సంఖ్య తగ్గుతుండటం చాలా ఊరటనిస్తోంది. ఇదివరకు సుమారు 50.3 శాతం కరోనా రికవరీ ఉండగా ఇప్పుడు అది 70.77 శాతానికి చేరింది. అంటే ప్రతీ 100 మంది రోగులలో 71 మంది కొలుకొంటున్నారన్నమాట! అలాగే కరోనా మరణాల రేటు ఇప్పుడు 1.96 శాతానికి తగ్గింది. 

దేశంలో ఇదివరకు రోజుకు సగటున 7 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పుడు రోజుకు 8.30 లక్షల పరీక్షలు చేస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచినందునే భారీగా కరోనా కేసులు బయటపడుతున్నట్లు భావించవచ్చు. ఇంత భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే కానీ ఇప్పటికైనా వారిని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తున్నందున వారిలో ఎక్కువమంది త్వరగా కోలుకోగలుగుతున్నారు. 

కానీ ఈ లెక్కన కేసులు పెరుగుతున్నట్లయితే కరోనా వ్యాక్సిన్‌ వచ్చేనాటికి భారత్‌లో కరోనా రోగుల సంఖ్య కోటి దాటిపోవచ్చు. కానీ ఇప్పుడు కరోనాను ఏవిధంగా కట్టడి చేయాలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు, వైద్యులకు, ఆరోగ్యశాఖలకు కూడా తెలిసింది కనుక ఎన్ని కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందనవసరంలేదనే చెప్పవచ్చు. కానీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం చాలా అవసరం. అప్పుడే దేశంలో కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుంది.


Related Post