శంకర్‌పల్లిలో కోచ్ ఫ్యాక్టరీకి కేసీఆర్‌ శంఖుస్థాపన

August 13, 2020


img

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని కొడంగల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఇవాళ్ళ దానికి శంఖుస్థాపన చేశారు. అయితే ఇది కేంద్రప్రభుత్వం లేదా రైల్వేశాఖ అధ్వర్యంలో ఏర్పాటవుతున్నది కాదు. మేధా సర్వొ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రూ.800 కోట్లు పెట్టుబడితో దీనిని ఏర్పాటుచేయబోతోంది. దీనికోసం 2017లోనే తెలంగాణ ప్రభుత్వం-మేధా సంస్థలు ఒప్పందం చేసుకొన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన 100 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చేందుకు ఇంత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇవాళ్ళ భూమిపూజ జరిగింది. 2022 నాటికి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని భూమిపూజ  కార్యక్రమంలో పాల్గొన్న మేధా కంపెనీ డైరెక్టర్స్ తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం అయితే ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 2,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 

ఈ కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో రైల్‌ బోగీలు కూడా తయారవుతాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఏర్పాటుచేయలేదని కానీ మేధా కంపెనీ పుణ్యామని రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇకనైనా కేంద్రప్రభుత్వం విభజన హామీలను అమలుచేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


Related Post