పోతిరెడ్డిపాడు... ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే

August 13, 2020


img

రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్ధ్యం పెంచాలని నిర్ణయించి టెండర్లు పిలవడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో రెండు రాష్ట్రాల మద్య మళ్ళీ ఘర్షణ మొదలైంది. అయితే ఈ వ్యవహారంలో ఇరువురు ముఖ్యమంత్రులు తమ వైఖరికే గట్టిగా కట్టుబడి ఉండాలని నిర్ణయించుకోవడంతో దీనిపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శిస్తుండటంతో ఇది రాజకీయసమస్యగా కూడా మారింది. కనుక ఇప్పుడు కేసీఆర్‌, జగన్ ఇద్దరూ వెనక్కు తగ్గలేని పరిస్థితి నెలకొంది. ఇరువురు ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంలో ‘లాక్’ అయిపోవడంతో ఇదే అదునుగా ప్రతిపక్షాలు వారిని ఇరుకున పెట్టేందుకు మరింత జోరుగా విమర్శలు కురిపిస్తున్నాయి. 

ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి బుదవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పోతిరెడ్డిపాడును అడ్డుకొంటామంటూ సిఎం కేసీఆర్‌ చెపుతున్న డైలాగులు రాంగోపాల వర్మ సినిమా డైలాగుల్లా ఉన్నాయి. నిజానికి ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కర్త, ఖర్మ, క్రియ అన్ని సిఎం కేసీఆరే. అందుకే ఆ ప్రాజెక్టు అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నించడం లేదు. సిఎం కేసీఆర్‌ ఏపీ సిఎం జగన్‌తో కుమ్మకై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు. ఈ విషయంలో సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదనిపిస్తోంది. అందుకే ఓ పక్క ఏపీ ప్రభుత్వం టెండర్లను ఖరారు చేస్తున్నా సిఎం కేసీఆర్‌ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారు. ఒకవేళ పోతిరెడ్డిపాడును అడ్డుకోలేకపోతే సిఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయగలరా? సిఎం కేసీఆర్‌ పోతిరెడ్డిపాడు అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకొనేందుకు గట్టిగా పోరాడుతుంది,” అని అన్నారు.


Related Post