దేశంలో దళితుల రక్షణ కొరకు చట్టాలు, వారి తరపున పోరాడేందుకు దళిత సంఘాలు ఉన్నప్పటికీ దళితులపై నేటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియాను అడ్డుకొన్నందుకు వరప్రసాద్ అనే ఓ 22 ఏళ్ళ దళిత యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌లో బలవంతంగా గుండు కొట్టించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసింది. కానీ 48గంటల తరువాత అతను మళ్ళీ డ్యూటీకి హాజరయ్యాడని వరప్రసాద్ ఆరోపించాడు.
అతను తనకు జరిగిన అవమానం గురించి తెలియజేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నేరుగా ఓ లేఖ వ్రాశాడు. దానిపై వెంటనే స్పందించిన రాష్ట్రపతి ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఆగస్ట్ 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగంలో ఉపకార్యదర్శిగా పనిచేస్తున్న ఏ.జనార్ధన్ బాబు అనే అధికారికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. తక్షణమే ఆయనను కలిసి ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేయవలసిందిగా వరప్రసాద్‌ను ఆదేశించారు.
ఆ దళిత యువకుడు ధైర్యం చేసి రాష్ట్రపతికి లేఖ వ్రాశాడు కనుక అతనికి న్యాయం చేసేందుకు సాక్షాత్ రాష్ట్రపతి పూనుకొన్నారు. కానీ దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ దళితులపై ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారు అనేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దళితుల పట్ల సమాజం తీరు మారకపోవడమే అందుకు కారణమని చెప్పవచ్చు. అందుకే వారు తమ మనుగడ కోసం సమాజంతో పోరాడవలసివస్తోంది.
ఎవరిపై దాడులు జరిగినా వారు బలహీనులైతే మౌనంగా వాటిని సహించడమో కాస్త ధైర్యవంతులైతే ఎదురు తిరిగి పోరాడుతారు. వరప్రసాద్ ఉడుకు రక్తం కలిగిన యువకుడు కనుక తనపై దాడి చేసిన వారిని ధైర్యంగా నిలదీశాడు. కానీ శక్తివంతులైన ఇసుకమాఫియాను, పోలీసులను ఎదుర్కొనేశక్తి లేదు కనుక వారి చేత ఘోరంగా అవమానించబడ్డాడు. అయినా ధైర్యం కోల్పోకుండా రాష్ట్రపతికి లేఖ వ్రాసి పోరాడుతున్నాడు. ఒకవేళ పోరాడలేకపోతే నక్సలైట్లలో కలిసిపోయేవాడు. ఆ విషయం అతనే రాష్ట్రపతికి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. అదే కనుక జరిగి ఉంటే ఒక సామాన్య వ్యక్తిని సమాజమే నక్సలైట్‌గా మార్చిందనుకోవాలి. అప్పుడూ సమాజం అతనినే నిందిస్తుంది సంఘవిద్రోహిగా ముద్రవేసి! కనుక దళితులు, బడుగుబలహీనవర్గాలపట్ల సమాజం తీరు మారవలసిన అవసరం చాలా ఉందని ఈ ఘటన తెలియజేస్తోంది.