బిజెపి అందుకే జోక్యం చేసుకోలేదా?

August 07, 2020


img

జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ కూడా ఏపీని అన్యాయం చేశాయనే చెప్పక తప్పదు. అందుకే రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసిన తరువాత కూడా బిజెపి వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ‌పీకి ప్రత్యేకహోదా, విశాఖలో రైల్వే జోన్, రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం తమను మోసం చేసిందనే భావన ఏపీ ప్రజలలో ఉంది. ఈవిషయం బిజెపి నాయకులకు తెలియదనుకోలేము. అయినా బిజెపి తీరు మారలేదు. ఎందుకంటే ఏపీలో బిజెపికి బలం లేదు కనుక ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు. కనుక ప్రజాగ్రహం చూసి భయపడనవసరం కూడా లేదనే చెప్పవచ్చు. అందుకే రాజధాని విషయంలో తమకు సంబందం లేదని ధైర్యంగా చెప్పగలిగిందనుకోవచ్చు.   

చంద్రబాబునాయుడు హయాంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించడానికి సిద్దం అవుతుంటే, రాజధాని విషయంలో కేంద్రానికి సంబందం లేదని అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ, అధికారాలకు సంబందించిన విషయమని కనుక ఆ వ్యవహారంలో కలుగజేసుకోలేమని కేంద్రప్రభుత్వం అఫిడవిట్ ద్వారా ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. 

రాజధాని తరలింపు విషయంలో కేంద్రం అడ్డుకొంటుందని భావించిన పవన్‌ కల్యాణ్‌, బిజెపితో జత కడితే ఇప్పుడు ఆయనకు కూడా షాక్ ఇచ్చింది. దాంతో ఆయన ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఇంకా బిజెపితో కొనసాగుతారా లేక దానితో మళ్ళీ తెగతెంపులు చేసుకొంటారో చూడాలి. 

2019 శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన జనసేన పార్టీ కలిసిఉన్నా లేకున్నా బిజెపికి పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాని తన చెప్పుచేతలలో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకొనేందుకు కేంద్రం విముఖత చూపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో కూడా అడుగుపెట్టలేకపోతున్న బిజెపి అక్కడి ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతలలో ఉంచుకొనేందుకు పళనిస్వామిని కుర్చీలో కూర్చోబెట్టింది. కానీ ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి చాలా బలంగా ఉన్నారు కనుక ఆయన ప్రభుత్వానికి ఈవిధంగా పరోక్షంగా సహకరిస్తూ అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఏపీ రాష్ట్రం ఒక రాజకీయ ప్రయోగశాలగా మిగిలిపోతోంది. 


Related Post