హాజీపూర్ బాదిత కుటుంబాల గోడు వినేదెవరూ?

August 06, 2020


img

హాజీపూర్ వరుస హత్యాచారాల కేసు మొదలయ్యి 16 నెలలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు దోషిగా నిర్ధారించబడిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష అమలుచేయలేదు. అతని చేతిలో హత్యాచారానికి గురైన ముగ్గురు బాలికల తల్లితండ్రులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందలేదు. శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఆలస్యం కావడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆరోజు ప్రభుత్వం ప్రకటించిన హామీలు 16 నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదో తెలీదు. సిఎం కేసీఆర్‌ తలుచుకొన్నారు కనుక కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి నెలలోపుగానే 5 కోట్లు నష్టపరిహారం అందజేశారు. సిఎం కేసీఆర్‌ స్వయంగా ఆయన భార్య సంతోషికి వాణిజ్యశాఖలో గ్రేడ్-1 ఉద్యోగానికి నియామక ఉత్తర్వులు అందజేశారు. రెవెన్యూ అధికారులు ఆమెకు హైదరాబాద్‌లో రూ.10 కోట్లు విలువైన నివాస స్థలం పత్రాలు అందజేశారు. కానీ 16 నెలలు గడిచినా హాజీపూర్ బాధిత దళిత కుటుంబాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం విచిత్రం. 

ప్రభుత్వం తరపున జిల్లా అధికారులు వారికిచ్చిన హామీలు: 

1. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు నష్ట పరిహారం. 

2. బాధిత కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వోద్యోగం. 

3. ఒక్కో కుటుంబానికి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. 

4. హాజీపూర్ గ్రామం సమీపంలో వాగుపై వంతెన నిర్మాణం. 

అయితే ఈ హామీలు అమలుచేయడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందో ఏమో బాధిత కుటుంబాలకు బీసీ కార్పొరేష్ నుంచి రూ.50,000 రుణం ఇప్పించింది. ఒక్కో కుటుంబానికి రూ.25,000 ఆర్ధికసాయం అందించింది. నిరుపేదలైన బాధిత కుటుంబాలు శిధిలావస్థలో ఉన్న ఇళ్ళలో నివశిస్తూ తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటూ ప్రభుత్వం ప్రకటించిన ఆ హామీల కోసం 16 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇంతవరకు ఆ హామీలు అమలుచేయలేదు. ఎప్పటికైనా చేస్తుందో లేదో తెలీని పరిస్థితి. రాష్ట్రంలో ఇటువంటి నిరుపేదలు, కష్టాలు అనుభవిస్తున్నారు లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు కనుక ప్రభుత్వాన్ని అడగలేము. తప్పుపట్టలేము. కానీ హాజీపూర్‌లోని మూడు బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చింది కనుక వాటిని నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా? అధికారుల చుట్టూ తిరుగుతూ ఎదురుచూపులతో కాలం గడపడం ఎంత కష్టమో అది అనుభవించినవారికే అర్ధం అవుతుంది. కనుక ఇకనైనా ప్రభుత్వం తమ మొర ఆలకించి ఇచ్చిన హామీలను అమలుచేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.


Related Post